కాసులుపట్టి !
చెరువు మట్టి ..
అమరావతి : జిల్లా కేంద్రంలో మట్టి, గ్రావెల్ మాఫి యా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ లే అవుట్‌లకు తరలిస్తున్నా రు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అను మతి తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.150 నుంచి రూ.200 వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తరువాతే తవ్వకాలు చేపట్టాలి. కానీ, ఇవేమీ జిల్లా కేంద్రంలో కనిపించడం లేదు. అక్రమ మట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పచ్చ నేతల జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి చె ల్లించాల్సిన వేల రూపాయల సెస్‌కు ఎగనామం పెడుతున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న చెరువులు, రాళ్ల గుట్టలు, ఎర్రమట్టి దిబ్బలు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కాజూ రు చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి వందల లోడ్లు తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
దూరాన్ని బట్టి.. మట్టి రేట్లు
స్థానిక పచ్చనేతలు కొంత మంది ఇరిగేషన్ శాఖకు చెందిన కాజూరు చెరువులో నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. జేసీబీలతో వందల లోడ్లు తవ్వి భూమాతకు కన్నీరు పెట్టిస్తున్నారు. తవ్విన మట్టిని జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు, ఇసుక బట్టీలకు తరలించి అమ్మేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడు అయితే రూ.2000 నుంచి రూ.4 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంపై చంద్రబాబు సర్కారుకు చెందిన నేతలు సంబంధిత శాఖల అధికారులకు ఫోన్‌లు చేసి చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసేందుకు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఈ అక్రమ మట్టి తవ్వకాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అడ్డుకట్ట వేస్తారా? మిన్నుకుండి పోతారా ? అనేది వేచి చూడాల్సి ఉంది.
కాపలాగా రౌడీలు
కాజూరు చెరువులో మట్టి అక్రమ రవాణాను తరలించే సమయంలో బయటి వ్యక్తులు రాకుండా రౌడీలను కాపలా పెట్టారు. ఈ రౌడీలు అటువైపు వెళ్లిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాజూరు చెరువులో మట్టి దందా కొద్ది రోజులుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పట్టించుకునేవారు కరువయ్యారు. ఆ అక్రమ మట్టి తవ్వకాలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు వాహనాలను సీజ్ చేస్తే తవ్వకాలు ఆగే అవకాశం ఉంది. అయితే ఆ రకమైన చర్యలు చేపట్టడంలో జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఆపేవారు.. అడిగేవారే లేరు..
జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న కాజూరు చెరువు కబ్జాకు గురవుతోంది. చిత్తూరు నగరానికి తాగు, సాగునీరు అందించేందుకు గంగినేని, కట్టమంచి, కాజూరు చెరువులు ప్రధానమైనవి. వర్షాకాలంలో ముఖ్యమైన ఈ మూడు చెరువులు నిండితే నగరానికి తాగునీటితో పాటు కింది భాగంలో ఉన్న రైతుల భూములకు నీళ్లందుతాయి. రెవెన్యూ రికార్డుల్లో జడియం చెరువుగా, వాడుకలో కాజూరు చెరువుగా పిలిచే ఈ చెరువు సర్వే నంబర్ 159, 170లో దాదాపు 200 ఎకరాల మేరకు వ్యాపించి ఉంది. కాజూరు, ఇరువారం, కొండ ప్రాంతం, పోతంబట్టు ప్రాంతాల నుంచి ఏడు సప్‌లై ఛానళ్లు ఉన్నాయి. కాలక్రమేణా వీటిలో ఐదు ఛానళ్లను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దీంతో పెద్ద వర్షం కుసినప్పటికీ కాజూరు చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు రోడ్డును ఆనుకుని ఉండటం, రోజు రోజుకూ నగరం విస్తరించడంతో కబ్జాదారుల కన్ను కాజూరు చెరువుపై పడింది. చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న కారణంగా ఈ చెరువుపై పచ్చనేతల కబ్జాదారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.


