పోలీసు గ్రీవెన్స్‌కు 53 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 53 ఫిర్యాదులు అందాయి. చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, డబ్బు తగాదాలు, భూ తగాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ఆన్‌లైన్‌లో సైతం నమోదు చేయాలన్నారు.
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
బంగారుపాళెం: మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తోతాపురి రకం మామిడి ప్రస్తుతం కిలో రూ.4 నుంచి రూ.5కు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు పెట్టిన ఖర్చులు సైతం రాకపోవడంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టులాడుతున్నారని పేర్కొన్నారు. గుజ్జు పరిశ్రమ యజమానులతో సంప్రదించి మామిడికి కనీస ధర కిలో రూ.25గా నిర్ణయించాలన్నారు. అనంతరం నాయకులతో కలసి గ్రామాల్లోని మామిడి తోటలను పరిశీలించారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకరన్, జిల్లా ఉపాధ్యక్షుడు వాడా గంగరాజు, రైతు సంఘ నాయకులు సుబ్రమణ్యం, లోకేష్, రాజన్న పాల్గొన్నారు.


