గంగమ్మా.. దీవించమ్మా
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ దీవెనల కోసం భక్తులు బోయకొండకు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండలో ఎటుచూసినా జన సంద్రంగా మారింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


