చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు శుక్రవారం వేరుశనగ విత్తన కాయలొచ్చాయి. తొలి విడతగా కొన్ని మండలాలకు కాయలను అధికారులు సరఫరా చేశారు. మొత్తం 4108.2 క్వింటాళ్ల విత్తనం రాగా..కుప్పంకు 848.7 క్వింటాళ్లు, వి.కోటకు 424.5 క్వింటాళ్లు, బైరెడ్డిపల్లికి 294 క్వింటాళ్లు, శాంతిపురానికి 357 క్వింటాళ్లు, రామకుప్పంకు 666 క్వింటాళ్లు వచ్చాయి. అయితే ఈ కాయలకు ప్రభుత్వం పూర్తి ధర ప్రకటించింది. కానీ రాయితీ ధర ప్రకటించలేదు. దీంతో కాయల పంపిణీకి ముహూర్తం ఖరారు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధ
తిరుపతి కల్చరల్ : కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా దామా రాధా నియమితు లయ్యారు. శుక్రవారం ఈమేరకు సమితి జిల్లా అధ్యక్షుడు మధురాయల్ ఆధ్వర్యంలో పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. హరిప్రసాద్ మట్లాడుతూ 200 మంది మహిళలతో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొన్నారు.
గంగమ్మ విగ్రహం దొంగ అరెస్టు
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం గంగమ్మ గుడిలో చోరీకి గురైన అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఆంపిప్లయిర్‌ను స్వాధీనం చేసుకుని శుక్రవారం నిందితుడిని ఆరెస్టు చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ అజీత్, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వారు మాట్లాడుతూ.. మండలంలోని వెంగళరాజుకుప్పంలోని గంగమ్మగుడిలో ఈనెల 13వ తేదీ దొంగలు అమ్మవారి ఊరేగింపు విగ్రహం, ఆంపిప్లయిర్‌ను చోరీ చేశారు. దీనిపై పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా రహస్య సమాచారం మేరకు బలిజకండ్రిగ–చిత్తూరు రోడ్డులో నిందితుడు హరీశ్‌ను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి పంచలోహ ఉత్సవ విగ్రహం, ఆంపిప్లయిర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో పాల్గొన్న దినేష్, చిరంజీవి పరారీలో ఉన్నారని తెలిపారు.


