
● తొలకరి సీజన్‌లో పిడుగులు పడే అవకాశం ● పిడుగుపాటుతో పె
పాలసముద్రం: వేసవిలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడంతోపాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములతో కూడిన పిడుగులు పడుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే భయమేస్తోంది. మెరుపు మెరిసి బలంగా ఉరిమిందటే ఎక్కడో ఓ చోటు పిడుగు పడే ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఉరుము ఉరిమిందంటే పొలాల్లోని రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు పిడుగు భయంతో చెట్ల చాటుకు పరుగులు తీస్తారు. ఒక్కొక్కసారి అదే వారి ప్రాణం మీదకు తీసుకొస్తుంది. చెట్లు ఎత్తుగా ఉండడంతో పిడుగులు ఎక్కువగా వాటిని ఆకర్షిస్తాయి. ఈ విషయం తెలియక చెట్ల కిందకు వెళ్లి పిడుగుపాటుతో చనిపోయినవారు జిల్లాలో లేకపోలేదు. అలాంటి వారిలో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇటీవల పిడుగులు ఏ ప్రాంతంలో ఏ సమయంలో పిడుగు పడే ప్రమాదం ఉందో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగానే పసిగట్టి తెలియజేస్తున్నారు. దీంతో కొంతవరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే పిడుగు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
ఆరు బయట ఉండకూడదు
ఉరుములు, మెరుపులు, వర్షం కురిసే సమయంలో ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతాలు, మైదానాలు, పొలాల్లో ఉండకూడదు. అలాగే పొడవైన చెట్ల కింద ఉండకూడదు. ఒకే చోట గుంపుగా ఉండకూడదు. గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార లాంటి ఇనుప వస్తువులు పెట్టుకోకూడదు. పిడుగు బారి నుంచి తప్పించుకునేందుకు నివాస గృహాలే మేలు.
– హేమలత, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
అప్రమత్తంగా ఉండాలి
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిడుగుపాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు సాధ్యమైనంత తొందరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తెన ప్రదేశాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉండకూడదు.
– హనుమంతరావు, జిల్లా ఇమ్యూనేజేషన్ ఆఫీసర్, చిత్తూరు
పాటించాల్సింది ఇవి..
వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎత్తైన చెట్లు, సెల్ టవర్లు, స్తంభాలు, కొండలు వద్దకు వెళ్లకూడదు.
ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కంప్యూట ర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, విద్యుత్ స్టవ్‌లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించకూడదు.
వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు నీటితో కూడిన పనులు చేయకూడదు.
గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదు.

● తొలకరి సీజన్‌లో పిడుగులు పడే అవకాశం ● పిడుగుపాటుతో పె