
కాలకూటమిపై
విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలకు నిరసనగా భగభగ మండే భానుడికి దీటుగా పాత్రికేయలోకం కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగింది. పత్రికా స్వేచ్ఛ హరింపునకు నిరసనగా పదం పదం కలిపి కదం తొక్కింది. మీడియా గొంతు నొక్కె చర్యలు తగవని గర్జించింది. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని ధ్వజమెత్తింది.
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
● సాక్షి ఎడిటర్ నివాసంలో ఖాకీల జులుంపై నిరసన ● చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన ఏపీయూడబ్ల్యూజే
చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌క్లబ్ నేతలు
చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో పాత్రికేయులపై దాడులు, తప్పుడు కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్ ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయడం, అనుమతి లేకుండా సోదాలు చేయడం ఆయన మాససిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారథిలా ఉన్న మీడియా రంగంపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ధనంజయరెడ్డిపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టారని, ఇది కోర్టు పరిధిలో ఉండగా.. నేడు ఇంట్లోకి చొరబడి ఆయన కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, సీనియర్ పాత్రికేయు లు శివ, గజపతి, బాలసుందరం, హరీష్, రాజేష్, సాయి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాపై బెదిరింపు ధోరణి మంచిది కాదు
పలమనేరు: మీడియాపై పోలీసుల బెదిరింపు ధోరణి మంచిది పద్ధతి కాదని ప్రెస్‌క్లబ్ నేతలు అన్నారు. పోలీసులు విజయవాడలోని సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి ఎలాంటి నోటీసులు లేకుండా చొరబడి అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ పలమనేరు ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఇన్‌చార్జ్ ఏఓ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏదో కేసులో ముద్దాయిలు అపార్ట్‌మెంట్‌లో ఉన్నారనే సమాచారంతో ఆ భవన సముదాయంలోని అన్ని ఇళ్లను తనిఖీలు చేస్తున్నామని భయపెట్టడం పద్ధతి కాదన్నారు. గౌరవప్రదమైన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపైనే పోలీసులు జులం ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో ఆయన పరువు ప్రతిష్టలకు విఘాతం కల్పించే రీతితో పోలీసులు వ్యవవహరించడం తగదన్నారు. ఎలాంటి కేసులు లేకున్నా కేవలం సాక్షి మీడియాను అణగదొక్కేందుకు ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇది కేవలం సాక్షి ఎడిటర్‌పై మాత్రమే జరిగింది కాదని, భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇలాంటి ఆంక్షలు, దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పరిరక్షణకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ఇలాంటి దిగజారుడు చర్యలు దిగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్, రెడ్డెప్ప, మణి, రమేష్, మోహన్‌మురళి తదితరులు పాల్గొన్నారు.

కాలకూటమిపై

కాలకూటమిపై