
ప్రగతి జాడ కనిపించేనా?
● గిట్టుబాటు ధర లేక టమాట రైతుల గగ్గోలు ● పంటలపై ఆగని గజదాడులు ● రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరత ● రెవెన్యూ కార్యాలయాల్లో ముడుపులు ఇవ్వకుంటే చుక్కలే ● నేడు జిల్లా స్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : ‘ఇన్‌చార్జ్ మంత్రి జిల్లాలో సమస్యలు పట్టించుకునేనా? ఈ సమావేశంలోనైనా అభివృద్ధి గురించి చర్చించేనా? లేదా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెండు నెలలకు ఒకసారి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో జిల్లా అభివృద్ధితోపాటు, ప్రజల సమస్యలు చర్చించాల్సి ఉంది. అయితే కీలకమైన ఈ అభివృద్ధి కమిటీ సమావేశం కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టానుసారంగా తమకు నచ్చినప్పుడు నిర్వహిస్తున్నారు. అప్పుడైనా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే.. అదీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకు ఒకటే సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు ఇన్‌చార్జ్ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పట్ల క్షుణ్ణంగా చర్చించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బంది కొరత.. రైతుకు అవస్థ
రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఆ కేంద్రాల్లో పనిచేస్తున్న అరకొర సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. ఫలితంగా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో 249 రైతు సేవా కేంద్రాలుండగా 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వ్యవసాయ, ఉద్యానశాఖల కు సంబంధింన పోస్టులే అధికంగా ఉండడంతో సమస్యలు అధికంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో నెలలు గడుస్తున్నా ఆ పోస్టులను భర్తీ చేయని దుస్థితి.
ముడుపులిస్తేనే పనులు
జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఆ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ముడుపులిస్తేగానీ పనులు జరగడం లేదు. అడిగినంత ఇస్తేనే ఫైళ్లను ముందుకు పంపుతున్నారు. అడిగినంత ఇచ్చుకోలేని రైతుల భూముల మ్యుటేషన్ దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారు. లేదంటే చిన్న చిన్న కారణాలను సాకుగా చూపించి పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం లంచాలు అడుగుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాలకు పరిష్కారం కోసం వెళ్లే దరఖాస్తులను పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తున్నారు.
అప్పుల ఊబిలో టమాట రైతు
జిల్లాలో ప్రధాన పంట అయిన టమాట. ఈ పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. టమాట ధరలు రోజు రోజుకూ తగ్గిపోతుండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి రకం 15 కిలోల బాక్సు రూ.90కి తగ్గిపోయింది. రెండు, మూడోరకం రూ.40 నుంచి రూ.60 వరకు మాత్రమే ధర ప లుకుతోంది. టమాట ధరలు పతనావస్థలోనే కొ నసాగుతున్నా కూటమి సర్కారు ఏ మాత్రం ప ట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
పంటలపై ఆగని గజదాడులు
జిల్లాలోని కుప్పం, బంగారుపాళెం, పలమనేరు, పులిచెర్ల, గుడిపాల తదితర మండలాల్లో రైతుల పంటలపై గజదాడులు ఆగడం లేదు. జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ రైతుల పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. ఈ నెల 2 వ తేదీన పులిచెర్ల మండలంలోని కమ్మపల్లి, రాయవారిపల్లి పంచాయతీల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. అదే రోజు బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగులు పంటలపై దాడి చేశాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయిన్నప్పటికీ కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్రగతి జాడ కనిపించేనా?

ప్రగతి జాడ కనిపించేనా?