
యూపీఎస్సీ పరీక్షలో 446 ర్యాంకు
మెడిసిన్ చదువుతూ సివిల్స్‌లో ఎంపిక
తండ్రి కలను సాకారం చేసింది
బైరెడ్డిపల్లె మండలంలో ఇద్దరు సివిల్స్‌కు ఎంపిక
సాధారణంగా పిల్లలు చిన్నతనం నుంచి తమ తల్లిదండ్రుల్నే రోల్ మోడల్‌గా తీసుకుంటూ లక్ష్యం కోసం శ్రమిస్తారు. కలలు కనడం వేరు. ఆ కలలను సాకారం చేసుకోవడంలో పడే శ్రమ వేరు. అలా శ్రమించి, ఓ యువతి తన తండ్రి కలలను సాకారం చేసింది. ‘‘తల్లీ! మనం చిన్నమారుమూల గ్రామంలో ఉన్నాం.. ఇక్కడ మనలాంటి పేదలకు ఎన్నో సమస్యలున్నాయి. ఇవన్నీ తీరాలంటే కష్టాలు తెలిసిన మనలాంటి వాళ్లు కలెక్టర్‌గా రావాల..నీవు ఎలాగైనా కలెక్టరై ప్రజలకు సేవ చేయాలమ్మా!’’ ఇదీ ఆ మధ్య తరగతి తండ్రి చిన్నతనం నుంచే నూరిపోసిన మాటలు ఆమె మదిలో బలంగా నాటుకుపోయాయి. నీట్‌లో ఎంపికై ఎంబీబీఎస్ చదివి డాక్టరైంది. అంతటి తో సంతృప్తి చెందలేదు. తండ్రి పంచిన ప్రేమ, నింపిన స్ఫూర్తి, ధైర్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా ముందుకు కదిలింది. నాలుగుసార్లు సివిల్స్‌కు ఆన్‌లైన్‌లో శిక్షణ పొందింది. ఈ పర్యాయం జాతీయ స్థాయిలో 446 ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది. ఊరంతా తబ్బిబ్బవుతోంది.
పలమనేరు : పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని రామాపురం మారుమూల గ్రామం. అభివృద్ధికి నోచుకోని ఈ గ్రామం మండల కేంద్రానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 66 కుటుంబాలు ఉన్నాయి. సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. చాలావరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే. సరిగ్గా కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామస్తులకు అటు రవాణా, చదువులు, వైద్యం, ఇతరత్రా వాటికి కర్ణాటక పట్టణాలు అనుకూలంగా ఉండడడంతో ఆ ప్రాంతాలతోనే ఎక్కువ అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారు. సరిహద్దు గ్రామం కావడంతో ఇటు ఆంధ్రాలో అటు ఆనుకుని కర్ణాటకలోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆంధ్రా భూముల్లోని బోర్లతో రెండువైపులా పంటలు సాగు చేస్తున్నవారూ కొందరు ఉండటం విశేషం! గ్రామస్తులైన రవికుమార్, నందిని దంపతులు కర్ణాటకలోని శ్రీనివాసపురంలో ప్రైవేటు స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరికిద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ఆర్.మాధవిని ప్రాథమిక విధ్యను సైతం అక్కడే చదివించారు. ఆపై పీయూసీలో బైపీసీ కోలార్ సహేంద్ర కళాశాలలో చదివి నీట్‌లో 900 ర్యాంకు సాధించింది. దీంతో బెంగళూరులోని ఈఎస్‌ఐలో ఎంబీబీఎస్ ఫ్రీ సీటును సాధించి డాక్టరైంది.
తండ్రి కోరిక సాకారం చేయాలని..!
తాను ఎంబీబీఎస్ చేస్తున్నా సివిల్స్ సాధించాలనే తండ్రి కోరిక కోసం కష్టపడింది. డాక్టర్ కోర్సులో చాలా బిజీగా ఉన్నప్పటికీ హాస్టల్‌లో రాత్రుల్లో నిద్రపోకుండా సివిల్స్‌కు కేవలం ఆన్‌లైన్‌లోనే శిక్షణ పొందింది. ఎంబీబీఎస్ చేరినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు సివిల్స్‌లో ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు ఈసారి సివిల్స్‌లో 446 ర్యాంకు సాధించింది. మరో ఆరునెలల పాటు శిక్షణ పొంది ఆపై ఐఏఎస్ లేదా ఐపీఎస్‌కు ఎంపికానుంది. ఇలా ఉండగా, బైరెడ్డిపల్లెకు చెందిన రంపం శ్రీకాంత్ సైతం సివిల్స్‌లో 904 ర్యాంకును సాధించడం విదితమే.
తన తండ్రి కల నెరవేర్చడానికి కాలేజీ డేస్ నుంచే పట్టుదలతో చదివినట్టు సివిల్స్ విజేత మాధవి చెప్పారు. సివిల్స్‌కు ఎంపికై న నేపథ్యంలో ఆమె అనుభవాన్ని పాఠకులకు పంచేందుకు సాక్షి ఫోన్‌లో ఇంటర్వ్యూ చేసింది.
సాక్షి : డాక్టరయ్యాక సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు?
మాధవి : డాక్టరయ్యాక ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చేరాను. సివిల్స్‌లో చేసిన ప్రయత్నాల నుంచి కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో కొన్ని నెలల పాటు శిక్షణ పొందాను. రోజుకు 8 గంటలు శిక్షణకు కేటాయించేదాన్ని.
సాక్షి : సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నారు?
మాధవి : ఎమర్జింగ్ మెడిసిన్ తీసుకున్నా.
సాక్షి : పుస్తకాలు, మెటీరియల్ కోసం ఏం చేశారు?
మాధవి : 400 పైచిలుకు పుస్తకాలు చదివా. ఇంతకుముందు సివిల్స్‌కు ప్రిపేర్ అయిన సీనియర్స్ నుంచి మెటీరియల్ తీసుకున్నా. అది కూడా నాకు ఉపయోగపడింది.
సాక్షి : ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు వేశారు?
మాధవి : మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ప్రశ్నలే వేశారు. కాన్ఫిడెంట్‌గా అన్నింటికీ సమాధానాలు చెప్పాను.
సాక్షి : మీకు స్ఫూర్తి ఎవరు?
మాధవి : ఇంకరెవరు మా నాన్నే! సమస్యల నడుమ పెరిగాం. నువ్వు డాక్టరైతే నలుగురికి సూదులేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే సివిల్స్‌లో ఎంపికై తే ఎందరికో మేలు చేయవచ్చు. అభివృద్ధికి నోచుకోని మన ఊరిలాంటి ఊర్లనెన్నో బాగు చేయవచ్చు..అని చెప్పేవారు. ఆ మాటలే నాపై బలమైన ప్రభావం చూపాయి. ఈ విజయం మానాన్నకే అంకితం.
‘సాక్షి’తో మాధవి
చాలా సంతోషంగా ఉండాది
మా ఊరంతా వ్యవసాయ కుటుంబాలే. చదువుకునేందుకు ఏ సౌకర్యాలూ లేవు. మాధవి పక్కనే ఉన్న కర్ణాటకలో చదివి, డాక్టరవడమే కాకుండా ఇప్పుడు సివిల్స్‌కు ఎంపిక అవడం చెప్పలేనంత సంతోషంగా ఉండాది. మా ఊరికే కాదు..దేశంలో ఎక్కడ పనిచేసినా ప్రజలకు మేలు చేస్తాదనే నమ్మకం మా ఊరికుంది.
–రామరాజు, గ్రామపెద్ద, రామాపురం