
జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు
● అధికారులతో కృష్ణబాబు
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ కృష్ణబాబు ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుప్పం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉండడంతో పరిశ్రమల స్థాపన విరివిగా నెలకొల్పాలన్నారు. ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయం ఆధారిత పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా కేంద్రంతో పాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. శిశు ఆధార్ నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖ పరిధిలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కిల్ ఆఫ్ చిత్తూరు కార్యక్రమం అమలులో రైతులకు సాంకేతిక పరిజ్ఞానంలో అవగాహన పెంచుతున్నామన్నారు. ఈ సమీక్షలో ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఎఫ్‌ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, పలు శాఖల అధికారులు రవికుమార్ నాయుడు, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరమణ, వెంకటేశ్వరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సదుపాయాలే లక్ష్యం
కుప్పం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సదుపాయలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అన్నారు. సోమవారం కుప్పం వంద పడకల అస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని ఆరోగ్య రంగంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. టాటా సంస్థ డిటిజల్ నెర్వ్ సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. అత్యవసరమైన సమయాల్లో మందులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రికి వచ్చిన రోగులను నాణ్యమైన భోజనం అందుతుందా లేదా? మందులు అందుబాటులో ఉన్నాయా లేవా? అని అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆస్పత్రికి రోజుకు 300 నుంచి 350 మంది వరకు రోగులు రావడంపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని రోగులకు రక్తపరీక్షలు, అన్ని రకాల ఆధునికంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు వచ్చే రోగులకు సంబంధించి అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని వైద్యులకు సూచించారు. విలేజ్ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఆరోగ్య సిబ్బంది బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం
గుడుపల్లె: సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర వైద్య, సంక్షేమశాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కనమనపల్లెలోని హెల్త్ క్లినిక్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా గ్రామాల్లోని వైద్యాధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి బీపీ,షుగర్, రక్త హీనత , దీర్ఘకాలిక వ్యాధులపై ఇంటింటా సర్వేలు నిర్వహిస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా ఏఎన్‌ఎంలు, నర్సులు ఇళ్ల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తున్నారని అని ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో కుప్పం ఏరియా ఆస్పత్రి కమిషనర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్, డీఎంహెచ్‌ఓ సుధారాణి, ఎంపీడీఓ రాధాకృష్ణ, తహసీల్దార్ సీతారాం, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్, టీఎం బాబు పాల్గొన్నారు