
11 నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్ : నారాయణవనంలోని శ్రీపద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 10న అంకురార్పణ నిర్వహిస్తారని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్తంగా ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్నం, ఏఈవో రవి, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ అధికారుల వేధింపులపై విజిలెన్స్ విచారణ
సత్యవేడు: సత్యవేడు ఆర్టీసీ డిపో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని డ్రైవర్ గంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్సు అధికారి తిమ్మారెడ్డి, సీఐ వర్మ సోమవారం విచారణ చేపట్టారు. ఏప్రిల్ 29న డ్రైవర్ గంగయ్య డ్యూటీ నిమిత్తం ఆర్టీసీ గ్యారేజ్‌కు వచ్చాడు. బస్సును సెక్యూరిటీ పాయింట్ వద్దకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం వరకు కండక్టర్ రాకపోవడంతో ఆ సర్వీసును డీఎం వెంకటరమణ రద్దు చేసి మధ్యాహ్నం మూడు గంటల డ్యూటీకి వెళ్లాలని డ్రైవర్ గంగయ్యను ఆదేశించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, రాత్రి డ్యూటీకి వెళ్లలేనని గంగయ్య చెప్పడంతో డీఎం దూషించాడు. డ్రైవర్ సెక్యూరిటీ పాయింట్ వద్దకు వెళ్లగా అక్కడున్న సెక్యూరిటీ అధికారి సైతం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గంగయ్య హైబీపీ కారణంగా కింద పడి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో కోలుకున్నాడు. తర్వాత అధికారులు దూషించడంపై విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణకు వచ్చిన విజిలెన్సు అధికారులు తొలుత బాధితుడు గంగయ్యను విచారించి స్టేట్‌మెంట్ నయోదు చేశారు. అనంతరం కంట్రోలర్ వెంకటేశ్వర్లు, సెక్యూరిటీ అధికారి పళని, ఆర్టీసీ కండక్టర్ ఓ వెంకటేశులును విచారించి రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆర్టీసీ డీఎం వెంకటరమణను విచారించినట్టు తెలిసింది.