
పరిశ్రమల స్థాపనతో మహిళలకు ఉపాధి
● టైలరింగ్ శిక్షణ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ సుమిత్‌కుమార్
గంగవరం : ఒక కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ ఇంటి యజమానితో పాటు మహిళలకు కూడా జీవనోపాధి లభించినప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉండవని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన ఈస్ట్‌మెన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ టెక్స్‌ట్‌టైల్స్ పరిశ్రమ ద్వారా పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలో పని చేసేందుకు పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో టైలరింగ్ అనుభవం ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలకు శనివారం వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతోనే మహిళలకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. గార్మెంట్స్ ఏర్పాటు ద్వారా పలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, కంపెనీ సీఈఓ రితేష్‌కుమార్, జనరల్ మేనేజర్ మొయిద్దీన్, డీఐసీ ఏడీ వెంకటరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్ ఇస్మాయిల్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.