
నేడే నీట్
● పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేసిన అధికారులు ● జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు ● హాజరు కానున్న 710 విద్యార్థులు
చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ) ఆదివారం జరగనుంది. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా గుర్తింపు పొందిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 710 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి
నీట్‌కు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవీకేఎన్‌లో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అన్ని నియమ, నిబంధనలు పాటిస్తూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు.