
అమరావతి అభివృద్ధి చేస్తే చాలా?
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
కార్వేటినగరం : ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా.. అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం పుత్తూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో నరేంద్ర మోదీ ప్రధామంత్రి హోదాలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే మిగిలిన ప్రాంతాలు వెనుకబడి పోతాయని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఒకే ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే ఉప ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. గతంలో ఢిల్లీ నడిబొడ్డున ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు.. మోదీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. నేడు మోదీని పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే బాబు కంటే ఊసరవెల్లే నయమని అన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సిద్ధాంతమన్నారు. చంద్రబాబు కుటుంబానికి పోలవరం ఒక ఏటిఎం అని విమర్శించిన మోదీ నేడు చంద్రబాబు విజన్ అని ప్రశంసించడం దారుణమన్నారు. అమరావతి శంకుస్థాపన పేరుతో పబ్లిసిటీ కోసం రూ.500 కోట్లు ప్రజాధనం వృథా అయిందని నారాయణస్వామి విమర్శలు గుప్పించారు.