
నైరాశ్యం..నిర్వేదం
చిత్తూరు అర్బన్: నామినేటెడ్ పదవుల్లో తమను గుర్తించకపోవడంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందో..లేదోననే నిర్వేదంలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కుప్పం మినహా అన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం, ఎంపీ స్థానం గెలుచుకోవడంలో కుప్పంలో పోలైన ఓట్లు ఓ సరికొత్త రికార్డును నెలకొలపడం తెలిసిందే. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని ఏడు స్థానాలకు గానూ ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు చెందిన నేతలు కూటమిగా ఏర్పడి కీలక పాత్ర పోషించారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో నాలుగు దఫాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయ్యింది. ఇందులో చాలా మంది మహా మహా ఉద్దండులకు చోటు లభించకపోగా కీలక పదవులపై ఆశలు పెట్టుకున్న కూటమి నేతల ఆశలపై ఆ పార్టీ అధిష్టానం నీళ్లు చల్లి పక్కన పెట్టేసింది. అసలు తమకు రాజకీయ భవిష్యత్తు ఉందా..? రానున్న రోజుల్లో ఇవ్వడానికి ఏవైనా పోస్టులు ఉన్నాయా..? ఏ పోస్టు ఇవ్వకుంటే మున్ముందు జనం గుర్తు పెట్టుకుంటారా..? అనే ప్రశ్నలు ఆ పార్టీ ప్రధాన నేతలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో తాము ప్రతిపాదించని, ఊహించని వ్యక్తులకు పలు కీలక పదవులు ఇవ్వడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లకు మింగుడుపడడంలేదు.
పక్కన పెట్టేశారా..?
● చిత్తూరులో ఎమ్మెల్యే జగన్‌మోహన్ గెలుపు చాలా మంది అంచనాలను తారుమారు చేసింది. ఈ గెలుపులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నాయుడు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ భర్త చంద్రప్రకాష్ నాయుడు, మాజీ కార్పొరేటర్ వసంతకుమార్ నాయుడు ఉన్నట్టు చెప్పుకుంటారు. సీకేకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగినా నిరాశే మిగిలింది. చుడా చైర్‌పర్సన్ కోసం వసంతకుమార్ ఏకంగా జగన్‌మోహన్‌తోపాటు ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగడితే ఆ సీటు మాజీ మేయర్ కటారి హేమలత తన్నుకుపోయింది. డీసీసీబీ చైర్మన్ తనకే దక్కుతుందనుకున్న దొరబాబుకు ‘అమాస’ రూపంలో భంగపాటు తప్పలేదు.
● అమర్‌నాథరెడ్డి గెలుపులో తానూ ఉన్నానని, ప్రభుత్వం వస్తే తనకు మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్‌పర్సన్ ఇస్తారకునున్న వి.కోట రామచంద్రనాయుడికి నైరాశ్యం తప్పలేదు. ఏఎంసీ చైర్‌పర్సన్ బీసీ–మహిళకు రిజర్వుకావడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. డీసీఎంఎస్ చైర్మన్ ఆశించిన పెద్దపంజాణి భాస్కర్‌రెడ్డిని అసలు పరిగణలోకే తీసుకోలేదు.
● పుంగనూరులో అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అన్ని అధికారాలను తన వద్దే ఉంచుకున్న చల్లాబాబు సైతం తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తారని ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఊహలకే పరిమితం చేశారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తనకే వస్తుందనుకున్న సమీపతికి పోటీగా సుబ్రమణ్యంరాజును తెరపైకి తీసుకొచ్చారు. బోయకొండ ఆలయ చైర్మన్ అవుతానని ఖారారుగా ఉన్న లక్ష్మీపతిరాజును వెంకటముని యాదవ్, ఎస్‌కె.రమణారెడ్డి రూపంలో కుర్చీకి అడ్డుగా నిల్చున్నారు.
● కుప్పంలో రెప్కో చైర్మన్ రేసులో రాజ్‌కుమార్, సురేష్‌బాబు, చంద్రశేఖర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమకే రెప్కో కుర్చీ ఇస్తారా..? కొత్త వాళ్లను కూర్చోపెడతారా..? అనే ప్రశ్నలు రోజురోజుకు వీళ్లల్లో హైటెన్షన్‌ను తెప్పిస్తోంది. ఏఎంసీ చైర్మన్‌గా పోటీ పడుతున్న కాణిపాకం వెంకటేష్, నాగరాజు, ఆంజనేయుల రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇలాగా ఉంది.
● కాణిపాకం చైర్మన్ కుర్చీ కోసం మణినాయుడు, పూర్ణచంద్రలో ఒకరికి భంగపాటు తప్పదు. శాప్ చైర్మన్, బంగారుపాళెం ఏఎంసీ చైర్మన్ ఆశించిన పూతలపట్టు ఎమ్మెల్యే మద్దతుదారుడు జయప్రకాష్ నాయుడికి ఏ పదవి రాకపోవడంతో ఇతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నగరిలో దేశాలమ్మ గుడి చైర్మన్, ఏఎంసీ పదవులకు మదన్, సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి మధ్య నెలకొన్న పోటీ కొత్త వ్యక్తుల తెరపైకి వచ్చేలా చెబుతున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మన్ పదవికి శ్రీధర్ యాదవ్, ధనుంజయ నాయుడు మధ్య నెలకొన్న పోటీలో ఒకరు కరివేపాకు అవడం ఖాయంగా కనిపిస్తోంది.
అనుకున్నదొక్కటి.. అయినదొకటి!
నామినేటెడ్ పదవులు దక్కక తమ్ముళ్ల ఆందోళన
ఆశపడి నిరాశకు లోనవుతున్న కూటమి నేతలు
మున్ముందు రాజకీయ భవిష్యత్తే ఉండదనే డైలామా
నగరి నుంచి కుప్పం వరకు ‘పచ్చ’ నేతల నైరాశ్యం
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కీలకంగా మారాం.. పార్టీ అధికారంలోకి వచ్చింది.. మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. మంచి నామినేటెడ్ పదవి వస్తుంది.. అని పలువురు పచ్చ నేతలు కలలుగన్నారు. అయితే వారి ఆశలపై బాబు నీళ్లు చల్లారు. దీంతో అనుకున్నదొకటి.. అయినదొకటి.. మనల్ని కరివేపాకులా వాడుకున్నారన్న నైరాశ్యం..నిర్వేదంలో ఉన్నారు.