
● కోట్ల విలువ చేసే రాతి సంపద దోపిడీ ● కూటమి అండతో విచ్చ
అనుమతి గోరంత.. తవ్వేది అంతా..! అన్నట్టుగా తయారైంది వడమాలపేట మండలంలో మైనింగ్ లీజు పరిస్థితి. తిరుమండ్యం గ్రామంలో 7.5 ఎకరాలకు అనుమతి తీసుకుని దాదాపు పది ఎకరాలకుపైగా తవ్వేసినా ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యం
వడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తిరుమండ్యం గ్రామంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతికి మించి కొండను పిండి చేస్తూ విలువైన రాతి సంపదను కొల్లగొడుతోంది. తిరుమండ్యం గ్రామ లెక్కదాఖలాలో సర్వే నం.175లో సుమారు 116 ఎకరాల గుట్ట పోరంబోకు ఉండగా.. అందులో 2.96 హెక్టార్లు (సుమారు 7.5 ఎకరాలు) మైనింగ్ నిమిత్తం లీజుకు తీసుకున్నారు. కొండను తవ్వి నెలకు సుమారు 45 వేల టన్నుల వరకు తరలిస్తున్నారు. ఇప్పటికే వారికి ఇచ్చిన పరిధిని దాటేశారు. దాదాపు 10 ఎకరాల మేరకు విస్తరించి తవ్వకాలు జరుపుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. క్వారీదారుకు అధికార పార్టీ నేతల అండ ఉండడంతో మైనింగ్ శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెట్టేస్తున్నారు. ‘మేము తనిఖీలు చేస్తుంటాం.. మీరు తరలిస్తూ ఉండండి’ అన్నచందంగా పరస్పర ఒప్పందంతో ఈ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక లోడ్డుకు బిల్లు చూపి.. పది లోడ్ల కంకర అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
పడగవిప్పుతున్న పర్యావరణ కాలుష్యం
ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంటే మరోవైపు సమీప గ్రామస్తులను పర్యావరణ కాలుష్యం గుదిబండగా మారింది. ఈ కార్వీకి 200 మీటర్ల దూరంలో దివంగత మహానేత వైఎస్సార్ ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన 25 నివాసాలు ఉన్నాయి. క్వారీలో రాళ్లను పేల్చడానికి వాడాల్సిన నమోదుకంటే ఎక్కువ నమోదులో పేలుడు పదార్థాలు వాడడంతో ఆ ప్రకంపనలకు సమీప ప్రాంతాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే 20 ఇళ్లు బీటలు వారిపోయాయి. రాత్రి పూట కంటిపై కనుకు లేకుండా పోతోందని స్థానిక భయాందోళన చెందుతున్నారు. క్వారీకి చుట్టుపక్కల సుమారు 300 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రైతులు మామిడి, వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. ఆ పంటలపై క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పడడంతో దిగుబడి తగ్గిపోతోంది. సుమారు 20 ఎకరాలలో దిగుబడి దారుణంగా పడిపోయింది. అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తవ్వేసి..మింగేసి!
లీజు తీసుకున్నవారికి పదేళ్లవరకు కంకర తరలింపుకు అనుమతి ఉంటుంది. కేటాయించిన విస్తీర్ణములో మాత్రమే రాళ్లను తవ్వి తరలించాలి. అలా తరలించే రాళ్లకు క్వారీదారు టన్నుకు రూ.150 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. అదే టన్నుకు బయట రూ.2,100 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. నెలకు 45 వేల టన్నుల రాళ్లను తరలిస్తుండగా అందులో 20 నుంచి 30 శాతానికి మాత్రమే రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల సొమ్ము క్వారీదారు జేబుకు చేరుతోంది. అందులో అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం.
పంట దిగుబడి రావడం లేదు
నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో ఒక ఎకర మామిడి తోట వేసుకోగా, మిగిలిన భూమిలో వరి సాగు చేసుకొని జీవనం సాగించేవాడ్ని. క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పంటలపై పడి దిగుబడి చాలావరకు తగ్గిపోయింది. మామిడి చెట్లకు పూత రావడం లేదు. వచ్చే పూత కూడా రాలిపోతోంది. నష్టాలపాలవుతున్నాను. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
–ధనంజయులురెడ్డి, తిరుమండ్యం

● కోట్ల విలువ చేసే రాతి సంపద దోపిడీ ● కూటమి అండతో విచ్చ