
పోరంబోకు భూమి ఆక్రమణ
గంగాధరనెల్లూరు: మండలంలోని వింజం రెవెన్యూ నాగూరుపల్లె సర్వే నంబర్ 893 /2లో 7.37 ఎకరాల పోరంబోకు భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి ఎన్నో తరతరాలుగా చుట్టుపక్కల గ్రామస్తులు పశువుల మేత కోసం వాడుకునేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కూటమి నేతల దీనిపై కన్ను వేశారు. నకిలీ పట్టా సృష్టించి, దాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచి అదే గ్రామానికి చెందిన అమరావతమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశారని, తరువాత అమరావతమ్మ నుంచి తన కోడళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని, ప్రస్తుతం ఆ భూమిలో అమరావతమ్మ కుటుంబసభ్యులు భారీ యంత్రాలతో చదును చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో తాము అడ్డుకోగా తమకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల అండదండలున్నాయని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. పలుమార్లు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టక పోగా ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. సదరు భూమిపై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయగా మండల రెవెన్యూ కార్యాలయం నుంచి సదరు సర్వే నంబర్‌పై ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదని, ఎవరికి ఎలాంటి పట్టా ఇవ్వలేదని సదరు సర్వే నంబర్ పోరంబోకు భూమి అని స్పష్టం చేశారు. కాగా సదరు భూమిపై అమరావతమ్మ కుటుంబ సభ్యులకు హక్కులు ఎలా కల్పిస్తారని, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతూ వారి మాటే చెల్లుబాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
క్రీడలతో ఉజ్వల భవిత: డీఎస్‌డీఓ బాలాజీ
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) బాలాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెసానిక్ మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలవులను వృథా చేయకుండా క్రీడా శిబిరంలో క్రీడల్లో శిక్షణ పొందాలన్నారు. క్రీడల్లో పట్టు సాధిస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త జయప్రకాష్‌నాయుడు, ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ రీజినల్ మేనేజర్ నాగరాజు, షణ్ముగం, రాజా, కోదండరామస్వామి తదితరులు పాల్గొన్నారు.
యువకునిపై హత్యాయత్నం
● గంగమ్మ చాటులో దాడి చేసిన ఓ గ్యాంగ్
● నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు
పలమనేరు: పట్టణంలో గంగమ్మ చాటు సందర్భంగా ఓ యువకునిపై కొందరు మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పలమనేరు సీఐ నరసింహరాజు కథనం మేరకు.. పట్టణానికి చెందిన గాంధీనగర్ వాసి సునీల్‌కుమార్(27) పాతపేటలోని ఓ గ్యాస్‌గోడౌన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గంగమ్మ జాతర చాటింపు సందర్భంగా సునీల్‌కుమార్ ఇంటికి వెళుతుండగా అతన్ని టార్గెట్ చేసిన కొందరు మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతన్ని స్థానికులు ఇక్కడి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మొండోళ్ల కాలనీకి చెందిన కళ్యాణ్, అతని సన్నిహితులైన పవన్, సాయి, హరి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడి చేసినట్టు సీఐ తెలిపారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని, వీరితోపాటు మరికొందరు ఉన్నారని తెలిపారు. ఈ ఘటన పాతకక్షల కారణంగా జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పట్టణంలో రౌడీయిజం సహించే ప్రసక్తే లేదని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

పోరంబోకు భూమి ఆక్రమణ

పోరంబోకు భూమి ఆక్రమణ