అశ్రునయనాలతో తల్లీబిడ్డకు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో తల్లీబిడ్డకు వీడ్కోలు

Aug 20 2024 1:16 AM | Updated on Aug 20 2024 11:28 AM

-

చౌడేపల్లె: నీటి గుంతలో పడి మృతి చెందిన తల్లీ కూతుళ్లకు సోమవారం స్వగ్రామంలో అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. మండలంలోని కాటిపేరిలో వేలాదిగా తరలివచ్చిన బంధుమిత్రులు, గ్రామస్తుల మధ్య వారికి అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె అనీషారెడ్డి(7), భార్య మౌనిక(32) మృతదేహాలను చూసి భర్త కుమార్‌రెడ్డి గుండెలు పగిలేలా ఏడ్చారు. 

ఆయన్ను ఓదార్చడం ఎవరివల్లనూ కాలేదు. మరోవైపు అసలేం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తున్న తనీష్‌ను చూసి స్థానికుల గుండె తరుక్కుపోయింది. గ్రామంలో ఒకే ఇంటి నుంచి రెండు మృతదేహాలు వెళ్లడంతో కుటుంబసభ్యుల ఘోష వర్ణనాతీతమైంది. గ్రామస్తులు, బంధువుల నడుమ కడసారి వీడ్కోలు పలికారు. వీరికి నివాళులర్పించడానికి వేలాది మంది ప్రజలు అక్కడకు తరలి రావడంతో కాటిపేరిలో విషాధ చాయలు అలుముకొన్నాయి.

కుటుంబ నేపథ్యం
చౌడేపల్లె మండలం కాటిపేరికి చెందిన కుమార్‌రెడ్డి ఎంఏ చదివారు. పుంగనూరుటౌన్‌లో సుమారు 10 యేళ్ల క్రితం పోలీస్‌ కానిస్టేబుల్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఫాకల్టీగా వెళ్లేవాడు. రామసముద్రం మండలం కొండూరుకు చెందిన మౌనిక కోచింగ్‌ సెంటర్‌కు వస్తూ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మౌనిక పట్టుదలతో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అనీషా (07), కుమారుడు తనీష్‌ (05) సంతానం. 

మౌనిక ఎక్సెజ్‌ శాఖలో మదనపల్లె సెబ్‌ –3 డిపోలో విధులు నిర్వహిస్తుండగా, భర్త కుమార్‌రెడ్డి సేద్యం చేస్తూ పాల ఆవులను మేపుతూ హాయిగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంపై విధి పగబట్టింది. ఆదివారం రాత్రి మౌనిక కుమారుడు, కుమార్తెతో కలిసి పొలం వద్ద నుంచి పాడి ఆవులను తోలుకుని ఇంటికి బయల్దేరింది. ఆవులు నీటికోసం ఫారం పాండ్‌ గుంతలోకి లాకెళ్లిపోయాయి. వాటితోపాటు కుమార్తె అనీషారెడ్డి నీటమునిగిపోయింది. ఆ పాపను రక్షించడానికి గుంతలోకి దూకిన మౌనిక కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఆ గ్రామం శోకసంద్రంగా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement