జిల్లాలో పెరుగుతున్న శ్వాస సంబంధిత కేసులు

- - Sakshi

ఊపిరాడనివ్వకుండా ఇబ్బంది పెట్టే ఆస్తమాను అదుపు చేసే వైద్యం అందుబాటులోకి వచ్చింది. జలుబు, దగ్గుతో బాధపడేవారు ఆస్తమాను త్వరగా గుర్తిస్తే కట్టడి చేయడం సాధ్యమవుతుంది. ఆస్తమా నివారణకు ప్రభుత్వం ఆధునిక వైద్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లాలో క్రమంగా ఆస్తమా కేసులు  పెరుగుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వెంటనే చర్యలకు  ఉపక్రమించింది. ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం  సందర్భంగా ప్రత్యేక కథనం.

చిత్తూరు రూరల్‌: సాధారణ మన జీవన శైలి, వాయుకాలుష్యం కారణంగా ఆస్తమా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. చలికాలం, వానాకాలం వచ్చిందంటే ఆస్తమా రోగులు తీవ్రంగా భయపడతారు. పూర్వం ఆస్తమాకు మందులు లేవు. ఇప్పుడు మందులు ఉన్నాయి. ఆస్తమాను పూర్తిగా అదుపులో ఉంచవచ్చు.

జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 8 సీహెచ్‌సీలు, 14 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడకు నిత్యం 5 వేలకు పైగా ఓపీలు వస్తుంటాయి. ఇందులో దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు, ఆస్తమా లక్షణాలు ఉన్నవారు రోజుకు 30 నుంచి 50 వరకు కేసులు వస్తున్నాయి. వీటిని డాక్టర్లు పరీక్షించి ల్యాబ్‌ పరీక్షల ఆధారంగా ఆస్తమాకు చికిత్స అందిస్తున్నారు.

ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి నయమయ్యేంత వరకు వైద్యుల పరిశీలనలో ఉండేలా చూస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు వస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఆస్తమా రోగులకు చికిత్స
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్‌హేలర్‌, కొన్నిరకాల మాత్రలు వాడాలి. ఆస్తమా సోకితే ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్‌ ఆర్గానిక్స్‌, కిడ్నీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్‌హీలర్‌ థెరపీ, నెబులైజేషన్‌ చికిత్సలతో రోగులకు నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

నమోదైన ఆస్తమా కేసులు

నెల సంఖ్య

జనవరి 4

ఫిబ్రవరి 4

మార్చి 52

ఏప్రిల్‌ 61

ఆస్తమా లక్షణాలు
ఆయాసం ప్రధాన లక్షణం

పిల్లికూతలు, దగ్గు 

ఛాతి బరువుగా ఉండడం

జలుబు, తుమ్ములు రావడం

ముక్కు నుంచి నీరు రావడం

జన్యు సంబంధిత కారణాలు

చలి కాలంలో ఆయాసం ఎక్కువ

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ధూమపానానికి, దుమ్ము, ధూళికి దూరంగా ఉండడం

శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు వంటివితీసుకోకుండా ఉండడం

ఇంట్లో బూజు దులపడం వంటివి చేయకూడదు

ఇన్‌హేలర్‌ కలిగి ఉండడం చాలా ముఖ్యం

ఆస్తమాకు కారణాలు

● వాతావరణంలో మార్పులు

● పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు

● బాడీ స్ప్రేలు

● అగరబత్తీల పరిమళాలు

● దోమల నివారణకు వాడే కాయిల్స్‌

● పెంపుడు జంతువులు

● టపాసుల వల్ల వచ్చే పొగ

● పూల పుప్పొడి రేణువులు

● సరిపడని ఆహారం తీసుకోవడం

● శీతల పానీయాలు

ముందు జాగ్రత్త అవసరం
దుమ్ము, దూళి, ఘూటు వాసనలు, స్ప్రేలకు దూరంగా ఉండాలి. చల్లని నీటితో తలస్నానం చేయకూడదు. శుభ్రత పాటించాలి. గోరువెచ్చని నీరు తాగాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. పొగతాగరాదు. మద్యం తాగకూడదు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

– రవిరాజు, జిల్లా క్షయ నివారణాధికారి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top