
పాకాల సభలో మోహిత్‌రెడ్డిని పరిచయం చేస్తున్న చెవిరెడ్డి
తిరుపతి రూరల్ : ‘‘2024 ఎన్నికల ప్రణాళిక, నిర్వాహణ, వైఎస్సార్‌సీపీకి చెందిన 23 అనుబంధ సంఘాల రాష్ట్ర ఇన్‌చార్జిగా గ్రామస్థాయి నుంచి వాటిని పటిష్టం చేయడం, పార్టీ వ్యవహారాల్లో వెన్నంటి ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ఆదేశించారు. వైఎస్ కుటుంబంతో మూడు తరాలుగా ఉన్న అనుబంధంతో ఆయన అప్పగించిన ఆదేశాలను శిరసావహిస్తూ వెళ్తున్నా.. అంతేకాక, ప్రాణంగా ప్రేమించే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు సేవచేసే అవకాశం నా బిడ్డ మోహిత్‌రెడ్డికి జగనన్న కల్పించారు. నన్ను ఆశీర్వదించినట్లే మోహిత్‌రెడ్డిని కూడా ఆశీర్వదించండి’’.. అని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.
ఈ మేరకు శుక్రవారం పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల్లో ఏర్పాటుచేసిన సభల్లో చెవిరెడ్డి మాట్లాడారు. తనను సొంత బిడ్డలా ఆశీర్వదించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తన కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. కన్నతల్లిలాంటి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకు తన బిడ్డను కూడా ఆశీర్వదించాలని ఆయన కోరారు. తనకు ఒక కన్ను కుటుంబమైతే.. మరో కన్ను నియోజకవర్గ ప్రజలని చెప్పారు. అందుకే తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయిలో 75శాతం నియోజకవర్గ ప్రజలకే ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు.
కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అంతకంటే ఎక్కువ ప్రాధ్యాన్యత నియోజకవర్గ అభివృద్ధికి.. ఆదరించి, ఆశీర్వదించిన ప్రజల సంక్షేమం కోసం ఇవ్వాలని మోహిత్‌రెడ్డికి సూచించినట్లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వెన్నంటి ఉండడం వల్ల నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించి, ఇద్దరం కలసి మనసా.. వాచా.. కర్మణా.. అభివృద్ధిలో అందరికీ ఆదర్శంగా మన చంద్రగిరి నియోజకవర్గాన్ని తయారుచేస్తామని పేర్కొన్నారు.