
● 31 వరకు టీచర్లకు ఆన్‌లైన్ శిక్షణ ● అనంతరం అసెస్‌మెంట్ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం నుంచి ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠ్యాంశాల బోధన.. అభ్యసన సామర్థ్యాల అనుసంధానమే లక్ష్యంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీచింగ్–లెర్నింగ్– ఈ–కంటెంట్‌ను దీక్ష ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసింది.
పకడ్బందీ పర్యవేక్షణ
జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోని టీచర్లందరికీ దీక్ష ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. బోధన, అభ్యసన, ఈ నెల 31వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు శిక్షణ అందిస్తున్నారు. మొత్తం 16 వేల మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సీఆర్‌పీలు, సమగ్ర శిక్ష సిబ్బంది శిక్షణ పొందుతున్నారు.
నేర్చుకున్న అంశాలపై పరీక్ష
శిక్షణ పొందిన టీచర్లకు నేర్చుకున్న అంశాలపై అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఒకే ప్రయత్నంలో 70 శాతం స్కోర్ సాధించిన వారికి మెయిల్ ద్వారా సర్టిఫికెట్ అందిచనున్నారు.
శిక్షణ తప్పనిసరి
ప్రతి ఉపాధ్యాయుడికి కాలానుగుణంగా నైపుణ్యాల పెంపు అవసరం. టీచర్లందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. దీని వల్ల బోధనాభ్యసన పద్ధతులను మెరుగుపరుచుకునే వీలుంటుంది. అందుకే పక్కాగా దీక్ష శిక్షణను నిర్వహిస్తున్నాం.
– పి.వెంకటరమణారెడ్డి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ, చిత్తూరు