● అన్నదాతకు ఆదరువుగా వినియోగదారులు ● గో ఆధారిత ప్రకృతి సేద్యానికి తోడ్పాటు ● నాణ్యమైన పంట ఉత్పత్తులను అందిస్తున్న రైతులు ● 30 సెంట్లలో 20 రకాల కూరగాయల సాగు ● పొలం నుంచి నేరుగా వంటింటికే సరఫరా | - | Sakshi
Sakshi News home page

● అన్నదాతకు ఆదరువుగా వినియోగదారులు ● గో ఆధారిత ప్రకృతి సేద్యానికి తోడ్పాటు ● నాణ్యమైన పంట ఉత్పత్తులను అందిస్తున్న రైతులు ● 30 సెంట్లలో 20 రకాల కూరగాయల సాగు ● పొలం నుంచి నేరుగా వంటింటికే సరఫరా

Mar 29 2023 12:18 AM | Updated on Mar 29 2023 12:18 AM

- - Sakshi

సేంద్రియ పద్ధతిలో రైతు సాగుచేస్తున్న వంగ పంట

యెండ్లూరి మోహన్‌, సాక్షి తిరుపతి డెస్క్‌:

ఉరుకులు పరుగుల జీవితం.. ఉన్నది తిని జీవనాధారం కోసం కాయకష్టం చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యంపై అంతగా పట్టించుకునే పరిస్థితులు ఇన్నాళ్లు లేవు. కోవిడ్‌ దెబ్బకి అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు. జీవన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుంటున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుల ఆలోచన ఇలా ఉంటే.. తాము పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేక, డిమాండ్‌ ఉన్న పంటలను పండించినా, వాటిని ఎలా మార్కెటింగ్‌ చేసుకోవాలో తెలి యక రైతులు అవస్థలు పడుతున్నారు.

వర్డ్‌ సంస్థ చొరవతో!

రైతుల కష్టాలను, వినియోగదారుల ఆలోచనలను వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(వర్డ్‌) సంస్థ వ్యవస్థాపకుడు, జిల్లా వ్యవసాయ బోర్డు సలహామండలి సభ్యుడు డాక్టర్‌ గంగాధరం గుర్తించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, రసాయనిక ఎరువులు లేని ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు ఒక వేదిక అవసరమని భావించారు. గోఆధారితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ విధానమే ఇందుకు సరైన పరిష్కారమని నిర్ణయించుకున్నారు. దీనిపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. చిన్న కమతాల్లోనే ఎక్కువ రకాల పంటలను తక్కువ ఖర్చుతో పండించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ఒక వ్యవస్థను ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

ఏడాదికి రూ.2.4 లక్షల ఆదాయం

ఎఫ్‌సీపీ పథకంలో భాగంగా తిరుపతి రూరల్‌ మండలం, వేమూరు, కస్తూరికండ్రిగ, రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు తదితర ప్రాంతాల్లో రైతులు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. టమాట, వంగ, మిర్చి, కాకర, బీర, సొరకాయ, గోరుచిక్కుడు, చెట్టుచిక్కుడు, చుక్కకూర, పాలకూర, తోటకూర, చిర్రాకు వంటి 20 రకాలను ప్రతి వారం వినియోగదారులకు అందజేస్తున్నారు. ఆ వారంలో దిగుబడి అయిన కూరగాయలు, ఆకు కూరలను 20 సమభాగాలుగా చేసి ఒక్కో ప్రత్యేక సంచిలో వేసి ఆటో ద్వారా ప్రతి వినియోగదారుడి ఇంటికే చేర్చుతున్నారు. కేవలం 30 సెంట్ల భూమిలో నెలకు ఖర్చులు పోగా రూ.20వేలు మిగులుతున్నట్లు రైతులు ఆనందంగా చెబుతున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ.2.4 లక్షల ఆదాయం వస్తోందని వెల్లడిస్తున్నారు.

సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను వేరుచేస్తున్న రైతులు

రైతు–వినియోగదారుల భాగస్వామ్యం

గోఆధారిత ప్రకతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించిన తర్వాత గంఽగాధరం వినియోగదారులపై దృష్టి సారించారు. ఈ మేరకు తిరుపతిలో గత ఏడాది జూన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు, వినియోగదారులకు పరస్పరం ఒప్పందం కుదిర్చారు. 20 మంది వినియోగదారులకు నెలకు తమ కుటుంబాలకు అవసరమైన 20 రకాల కూరగాయలను రైతు తన 30 సెంట్ల భూమిలో పండించాలి. అందుకు రైతుకు ప్రతి వినియోగదారుడు నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తాడు. అంటే నెలకు రూ.30 వేల వరకు చెల్లిస్తారు. ఏడాది పొడవునా ఈ బంధం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి రైతు–వినియోగదారుల భాగస్వామ్య పథకం (ఎఫ్‌సీపీ) అని పేరు పెట్టారు.

సేంద్రియ విధానంలోనే..

దేశీ ఆవుపేడతో సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నాం. 20 మంది వినియోగదారులు ముందుకొచ్చి సాగుకు సాయం అందించారు. వారికి ఆరోగ్యకరమైన, నాణ్యమైన పంట ఉత్పత్తులను అందిస్తున్నాం. పంటను ఎలా అమ్ముకోవాలి అనే ఇబ్బంది తప్పింది.

– వెంకటాద్రి, రైతు, వేమూరు

నాణ్యమైన కూరగాయలకోసమే..

మాకు అవసరమైన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో రైతు సాగుచేస్తున్నాడు. ఎలా చేస్తున్నారో మనమే వెళ్లి చూసుకోవచ్చు. రైతు ఏం చేస్తున్నాడో మనకు వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేస్తున్నాడు. ఇంతకంటే మంచి కూరగాయలు ఎలా దొరుకుతాయి?.

– టీవీ మనోహర్‌, వినియోగదారుడు, తిరుపతి

ఒప్పందంతో సత్ఫలితాలు

వినియోగదారునితో నేరుగా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల నిశ్చింతగా వ్యవసాయం చేసుకుంటున్నాం. సత్ఫలితాలు పొందుతున్నాం. రోజుకు రెండు గంటలు కష్టపడితే పెట్టుబడి పోగా నెలకు రూ.20వేలు మిగులుతోంది. – మునిరత్నం నాయుడు,

రైతు, కస్తూరికండ్రిగ

విశేష స్పందన

తొలి ప్రయత్నంలోనే వినియోగదారులతో ఒప్పందం కుదుర్చుకోవడంతో శ్రమతగ్గింది. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ పద్ధతిని అనుసరించడం వల్ల ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి. వినియోగదారులు సెలవు రోజుల్లో పంటపొలాలకు వస్తున్నారు.

– గంగాధరం, వర్డ్‌ సంస్థ ప్రతినిధి, తిరుపతి

పంటను పరిశీలిస్తున్న వినియోగదారులు 1
1/6

పంటను పరిశీలిస్తున్న వినియోగదారులు

దత్తత తీసుకున్న పొలంలో వినియోగదారులు 2
2/6

దత్తత తీసుకున్న పొలంలో వినియోగదారులు

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement