
చిత్తూరు: బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి గ్రామానికి చెందిన కదిరప్ప కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో మొక్కుకున్న మొక్కు తీరడంతో గ్రామ సమీపంలోని కాటేరమ్మకు దేవర చేయాలని భావించాడు. దేవరకు తమిళనాడు రాష్ట్రంలోని అరవట్లకు చెందిన బంధువులను పిలిచాడు. మంగళవారం అందరూ కలిసి కాళభైరేశ్వరస్వామి ఆలయం వద్ద పూజలు చేస్తుండగా.. అదే సమయంలో ఆయా కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు కొండ కింద కోనేటి వద్ద ఆటలాడేందుకు వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోనేట్లో దిగి స్నానాలు చేయాలని భావించారు. ఈ క్రమంలో దేవదొడ్డికి చెందిన కదిరప్ప కుమార్తె గౌతమి(14), కదిరప్ప బంధువులైన అరవట్లకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె భవ్య(17), లేట్ వెంకటరమణ కుమార్తె మౌనిక(13) ఒకరివెంట ఒకరు దిగి మృత్యుఒడికి చేరారు. చాలా ఏళ్లుగా పాడుబడిన కోనేటి కింది భాగంలో పాచిపట్టిపోవడం.. అది కాళ్లకు తగులుకుని బిడ్డలను పైకిరాకుండా చేసిందని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.
మూడు కుటుంబాల్లో విషాదం
దేవదొడ్డికి చెందిన కదిరప్పకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వీరిలో చిన్న కుమార్తె నీట మునిగి మృతిచెందింది. అటవట్లకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె భవ్య, అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె మౌనిక ఒకరివెంట ఒకరు కోనేట్లో దిగి ప్రాణాలు వదిలారు. ఇదిలావుండగా ఇటీవలే మౌనిక తండ్రి వెంకటరమణ మృతిచెందాడు. ఆ జ్ఞాపకాలు మరువక ముందే కుమార్తె దూరమవ్వడం ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. కోనేటి వద్ద ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు పర్యవేక్షణ లేకపోవడం, ఈ ఆలయం అడవిలో ఉండడంతో వారు ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోయారు.
కోరిన కోర్కెలు నెరవేర్చడంతో కులదైవమైన కాటేరమ్మకు దేవర చేయాలని నిశ్చయించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధుగణాన్ని ఆహ్వానించారు. అందరూ సంతోషంగా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఇంతలో కొండకింద ఉన్న కోనేట్లో ఆయా కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు ఒకరివెంట ఒకరు సరదాగా దిగి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. చేతికొచ్చిన బిడ్డలు దూరమవ్వడంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన మంగళవారం పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలం, తీర్థం సమీపంలోని కాళబైరేశ్వరస్వామి ఆలయం వద్ద తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.