తిరుపతి లీగల్ : గంజాయి కేసులో ఏడుగురికి ఏప్రిల్ 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్‌సివిల్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. తిరుమల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ సీఐకి ఈనెల 26వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ వ్యక్తి తిరుమలకు గంజాయి తీసుకెళుతున్నాడంటూ సమాచారం ఇచ్చాడు. తిరుపతి అలిపిరి సమీపంలోని సప్తగిరి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సీఐ అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. విచారణలో తిరుపతి మంగళం క్వార్టర్స్‌కు చెందిన జి.గంగాద్రిగా తేలింది. అతని వద్ద 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరకంబాడి తారకరామానగర్‌కు చెందిన వి.సక్కూబాయ్ అనే మహిళ వద్ద గంజాయి కొన్నట్టు తెలిపాడు. దీంతో ఆమె ఇంటిలో తనిఖీలు నిర్వహించి రూ.1.5 లక్షల విలువైన ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంగళం బీటీఆర్ కాలనీ చెందిన ఎం.సూర్యప్రకాష్, మిద్దిళ్లుకు చెందిన తిమ్మప్పమహేష్, తిరుమలకు చెందిన బి.రంజన్‌కుమార్ అలియాస్ సునీల్, జార్ఖండ్‌కు చెందిన అమిద్‌కుమార్‌యాదవ్, టీ సదుంకు చెందిన తళారి శివకుమార్ వద్ద 50 గ్రాముల చొప్పున గంజాయి ఉండడాన్ని గుర్తించారు. ఏడుగురిపై కేసులు నమోదు చేసి సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.