
నిందితుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
పలమనేరు/బైరెడ్డిపల్లె : పలమనేరు రఘువీరారెడ్డి కాలనీలో సోమవారం సెబ్ అధికారులు దాడులు చేసి కర్ణాటక మద్యం విక్రయిస్తున్న జ్యోతి, మదన్‌కుమార్‌తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 150 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ ఎల్లయ్య తెలిపారు. అలాగే గంగవరం మండలం పెద్ద ఉగుని వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌లో కర్ణాటక మద్యం తరలిస్తున్న రాము(34) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెక్‌పోస్టు సీఐ మాధవస్వామి తెలిపారు. 40 టెట్రాప్యాకెట్లు సీజ్ చేశామన్నారు. బైరెడ్డిపల్లె మండలం బెల్లంమడుగులో ఆడెప్ప అనే వ్యక్తి కర్ణాటక మద్యం అమ్ముతుండగా అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటనరసింహులు వెల్లడించారు. నిందితుడి నుంచి 33 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
పెంచలకోన దేవస్థానానికి భారీ రాబడి
రాపూరు: పెంచలకోన దేవస్థానానికి ఒక కోటి, రెండులక్షల, ముఫ్ఫై రెండువేల మూడు వందల, ఎనభై రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈఓ జనార్దన్‌రెడ్డి, జిల్లా ఎండోమెంట్ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. సోమవారం దేవస్థాన అలంకారమండపంలో హుండీ కానుకలను లెక్కించగా.. నగదు తోపాటు 360 గ్రాముల బంగారం, వెండి 4 కిలోల 800 గ్రాములు, యూఎస్‌ఏ డాలర్లు 89, కువైట్ దినార్లు 52, బహరిన్ దినార్ 1, మలెషియారింగిట్స్ 11, ఇంగ్లండ్ ఫైన్లు 25 వచ్చినట్లు వివరించారు. శ్రీవారి నిత్యాన్నదానంలోని హుండీలో రూ.3,85,908 వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం 86 రోజులకు చెందినదని వారు వెల్లడించారు.
నిబంధనల మేరకే పంచనామా
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో మూలవిరాట్ తొలగింపు సందర్భంగా నిబంధనల ప్రకారమే పంచనామా నిర్వహించామని ఈఓ సాగర్‌బాబు తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ మూలవిరాట్ తొలగింపులో విపక్షాలను పిలవలేదన్న అక్కసుతో అక్కడ లభించిన బంగారాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌లో అమ్ముకున్నారంటూ టీడీపీ నేత బొజ్జలసుధీర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. స్వామివారి మూలవిరాట్ తొలగింపు విషయాన్ని నాలుగు రోజుల ముందు ప్రకటించామని చెప్పారు. అందరి సమక్షంలో మూలవిరాట్‌ను నిబంధనలకు అనుగుణంగా తొలగించామన్నారు. సీసీకెమెరాల నిఘాలోనే పంచనామా నిర్వహించామన్నారు. బంగారు, వజ్రాలు దొరికాయంటూ టీడీపీ నేత చేసిన ఆరోపణలు అసత్యమన్నారు. ఇలాంటి ఆరోపణలపై దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అర్చకుడు మాట్లాడుతూ ఆలయ మూలవిరాట్ తొలగింపునకు పీఠాధిపతులు వంటి వారు రారని, అందరి సమక్షంలోనే పంచనామా నిర్వహించి మూలవిరాట్‌ను పానవట్టం నుంచి తొలగించామని తెలిపారు. అందులోని బంగారు, నవరత్నాలు, రాగిరేకులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచినట్టు వెల్లడించారు. అనంతరం వీఆర్వో బాలమురళి తాను చూసిన దాన్ని చూసినట్టు వివరించగా.. పాలకమండలి సభ్యులు జయశ్యామ్‌రాయల్ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే శ్రీకాళహస్తిలో తిరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో మల్లికార్జున్, మురళీధర్‌రెడ్డి, లోకేష్, సతీష్‌మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఈఓ సాగర్‌బాబు