
క్యూ1లో రూ. 801 కోట్లు
సెప్టెంబర్ నాటికి ఎస్‌ఎంబీసీ డీల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 801 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నమోదైన రూ. 502 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 59.4 శాతం అధికం. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, అసెట్ క్వాలిటీ మెరుగుపడటం, వడ్డీయేతర ఆదాయం పటిష్టంగా ఉండటం, వంటి అంశాలు వరుసగా ఏడో త్రైమాసికంలోనూ లాభాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడినట్లు బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో యస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 5.7 శాతం పెరిగి రూ. 2,371.5 కోట్లకు చేరింది.
నికర వడ్డీ మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 2.5 శాతంగా నమోదైంది. మరోవైపు, ట్రెజరీ లాభాల కారణంగా వడ్డీయేతర ఆదాయం 46.1 శాతం పెరిగి రూ. 1,752 కోట్లకు చేరింది. ప్రధానమైన ఫీజుల ఆదాయం 3 శాతం వృద్ధి చెంది రూ. 1,268 కోట్లుగా నమోదైంది. ఇందులో రిటైల్ వాటా 56.4 శాతంగా ఉంది. పటిష్టమైన పనితీరుతో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సుమితోమో మిత్సుయి కార్పొరేషన్ బ్యాంక్ (ఎస్‌ఎంబీసీ) డీల్ సెపె్టంబర్ నాటికి పూర్తి కావచ్చని పేర్కొన్నారు. బ్యాంకులో 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎస్‌ఎంబీసీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆస్తుల నాణ్యత మెరుగు
→ నిర్వహణ లాభం 53.4 శాతం పెరిగి రూ. 1,358 కోట్లకు చేరింది. పన్నుయేతర ప్రొవిజన్లు 34.1 శాతం పెరిగి రూ. 284 కోట్లకు చేరాయి.
→ మొత్తం డిపాజిట్లు 4 శాతం పెరిగి రూ. 2,75,843 కోట్లకు చేరాయి. కమర్షియల్ బ్యాంకింగ్, మైక్రోబ్యాంకింగ్ సెగ్మెంట్లలో డిమాండ్‌తో రుణాలు 5 శాతం పెరిగి రూ. 2,41,024 కోట్లకు పెరిగాయి.
→ అసెట్ నాణ్యత స్థిరంగా ఉంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.6 శాతం, నికర ఎన్‌పీఏలు 0.3 శాతంగా ఉన్నాయి.
→ ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) 80.2% మెరుగుపడ్డాయి.
→ సమీక్షాకాలంలో మొత్తం రూ. 1,170 కోట్ల రికవరీలు, అప్‌గ్రేడ్‌లను బ్యాంకు ప్రకటించింది.
→ స్లిప్పేజీలు క్రితం క్వార్టర్‌లో రూ. 1,223 కోట్లుగా ఉండగా, తాజాగా రూ. 1,458 కోట్లకు ఎగిశాయి.
→ క్యూ1లో మూడీస్, ఇక్రా తదితర ఏజెన్సీలు బ్యాంకు రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేశాయి.