
ముంబై: టెక్‌యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్‌లీజ్ డిజిటల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.
దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్–టెక్ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్ పేర్కొంది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
హోదాపరంగా చూస్తే సీనియర్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్‌షిప్ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం.పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఇటు నాన్–టెక్నికల్, అటు టెక్నికల్ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ ఆ తర్వాత స్థానంలో నిల్చింది.
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్‌షిప్ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి.
మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి.