ప్రస్తుతం ట్యూబ్ టైర్ల నుంచి ట్యూబ్‌లెస్ టైర్ల వరకు మార్కట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫంక్చర్ నుంచి కాపాడే పంక్చర్ షీల్డ్ ప్యాడ్ అనేది తెరమీదకు వచ్చింది. ఇదెలా పనిచేస్తుంది?, దీనివల్ల ఉపయోగాలేమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పంక్చర్ షీల్డ్ ప్యాడ్.. టైర్లలో ఉపయోగించడం వల్ల, పంక్చర్‌ను తక్షణమే మూసివేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ లీక్ వంటి వాటిని కూడా ఆపుతుంది. దీనిని టైర్లలో ఫిక్స్ చేయడం కూడా చాలా సులభం. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనిస్తే.. టైరు మధ్యలో క్లీన్ చేసుకుని, పంక్చర్ షీల్డ్ ప్యాడ్ అమర్చడం కనిపిస్తుంది. ఆ తరువాత అల్లాయ్ వీల్‌కు ఫిక్స్ చేశారు. ఇలా చేసిన తరువాత ఒక స్క్రూను టైరులో దింపి టెస్ట్ చేస్తారు. కానీ టైరుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆ తరువాత కారుకు టైరును ఫిక్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని, సురక్షితమైన డ్రైవ్ అందిస్తుందని తెలుస్తోంది.
ట్యూబ్ టైర్స్ vs ట్యూబ్‌లెస్ టైర్స్
ఇక ట్యూబ్ టైర్లు.. ట్యూబ్‌లెస్ టైర్ల విషయానికి వస్తే, ఈ రెండింటినీ వాహనాల్లోనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని తేడాలు గమనించవచ్చు. ట్యూబ్ టైర్.. రబ్బర్ ట్యూబ్ కలిగి ఉంటుంది. ఈ ట్యూబ్‌లోనే గాలి నింపుతారు. అయితే ట్యూబ్‌లెస్ టైర్లలో ట్యూబ్ ఉండదు. పైగా దీనిని అల్లాయ్ వీల్‌కు ఫిక్స్ చేసి.. గాలిని నింపుతారు.
ట్యూబ్ టైరు పంక్చర్ అయినప్పుడు.. టైరులోని గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే ట్యూబ్‌లెస్ టైర్లలో మాత్రమే ఇలా జరగదు. గాలి నెమ్మదిగా బయటకు వస్తుంది. వాహనాన్ని సేఫ్‌గా ఆపడానికి సమయం లభిస్తుంది.


