‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్‌

Inventions We Use Every Day Were Created For Outer Space - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్‌ కెమెరా.. మెమరీ ఫోమ్‌ పరుపులు.. కారు టైర్లు.. గీతలు పడని లెన్స్‌.. వాటర్‌ ఫిల్టర్‌.. ఇవన్నీ ‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్‌ తెలుసా? ఎందుకంటే ఇవన్నీ అంతరిక్ష ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లోంచి పుట్టినవి. మనం నిత్యం వాడే వస్తువులుగా మారిపోయాయి. మరి వీటి విశేషాలు ఏమిటో చూద్దామా..

గ్రహాంతర ప్రయోగాలు.. ఫోన్‌ కెమెరా..
►శాటిలైట్లలో బిగించేందుకు.. నాసాకు చెంది న జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) ఇంజనీర్‌ యూజీన్‌ లల్లీ మొదటిసారిగా 1960 దశకంలో డిజిటల్‌ కెమెరాలను రూపొందించారు. అవి పెద్ద పరిమాణంలో ఉండి, ఎక్కువ విద్యుత్‌ అవసరం పడేవి. దీంతో తక్కువ సైజులో ఉండే డిజిటల్‌ కెమెరాలపై పరిశోధన చేసిన జేపీఎల్‌ ఇంజనీర్‌ ఎరిక్‌ ఫోసమ్‌.. 1990 దశకం మొదట్లో ‘సీఎంఓఎస్‌– యాక్టివ్‌ పిక్సెల్‌ సెన్సర్‌ (ఏపీఎస్‌)’ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫోన్‌ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు వంటి మినియేచర్‌ కెమెరాల్లో వాడుతున్న టెక్నాలజీ ఇదే.

అంతరిక్షంలోకి పంపకున్నా.. ఇళ్లలోకి వాటర్‌ ఫిల్టర్‌..
►నాసా చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. వాళ్లకు మంచి నీళ్లు ఎలాగనే పరిశోధనలూ చేసింది. వాడిన నీటిని తిరిగి శుద్ధిచేసుకుని వినియోగించుకునేలా ‘ఎలక్ట్రోలైటిక్‌ సిల్వర్‌ అయాన్‌ జనరేటర్‌’ను అభివృద్ధి చేసింది. ఈ వాటర్‌ ఫిల్టర్‌ను అంతరిక్ష ప్రయోగాల్లో వాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలోకి వచ్చేసింది. అయితే దీనికన్నా మెరుగైన, ఖరీదైన టెక్నాలజీని ‘అపోలో’ ప్రయోగాల్లో వాడారు.

స్పేస్‌ షటిల్‌లో సీట్లు.. మెమరీ ఫోమ్‌ పరుపులు
►స్పేస్‌ షటిల్స్‌ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వాటిలో ఉండే వ్యోమగాము లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలా ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేందుకు నాసా 1960వ దశకంలో ‘పాలీయూరేథీన్‌ సిలికాన్‌ ప్లాస్టిక్‌ (మెమరీ ఫోమ్‌)’ మెటీరియల్‌ను అభివృద్ధి చేసింది. స్పేస్‌ షటిల్‌ సీట్లలో అమర్చింది. అవే ఇప్పుడు మనం వాడుతున్న మెమరీ ఫోమ్‌ పరుపులు, దిండ్లు.

అనుకోకుండా కనిపెట్టిన.. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ లెన్స్‌..
►వ్యోమగాములు హెల్మెట్‌ కోసం గాజును వాడితే ప్రమాదకరం కావడంతో నాసా ఫైబర్‌ గ్లాస్‌ను వినియోగించింది. కానీ దానిపై సులువుగా గీతలు పడి ఇబ్బంది వస్తుండటంతో పరిష్కారంపై ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే చిత్రంగా టెడ్‌ వైడెవెన్‌ అనే శాస్త్రవేత్త వాటర్‌ ఫిల్టర్‌ కోసం చేస్తున్న ప్రయోగాల సందర్భంగా.. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కళ్లద్దాల నుంచి టీవీలు, మానిటర్లు, ఫోన్‌ స్క్రీన్ల దాకా ఈ కోటింగ్‌ను వాడుతున్నారు.

మార్స్‌పై దిగే ప్యారాచూట్‌ తాళ్లు.. కారు టైర్లు..
►1976లో నాసా ప్రయోగించిన ‘వైకింగ్‌ ల్యాండర్‌’ అంగారకుడిపై సురక్షితంగా దిగేందుకు ప్యారాచూట్‌లను వినియోగించారు. అసలే మార్స్‌పై తేలికైన వాతావర ణం, ఎక్కువ బరువున్న ప్రోబ్‌.. ప్యారా చూట్‌ తాళ్లు అత్యంత బలంగా ఉండాలి. దీనిపై నాసా విజ్ఞప్తి మేరకు.. ‘గుడ్‌ ఇయర్‌ టైర్‌ అండ్‌ రబ్బర్‌ కంపెనీ’ ఉక్కుకన్నా బలమైన రబ్బర్‌ మెటీరియల్‌ను రూపొందించింది. తర్వాత దీనిని వాహనాల టైర్ల తయారీలో వాడటం మొదలుపెట్టారు.

ఇంకా ఎన్నో..
►స్పేస్‌ ఫ్లైట్లలో, విమానాల్లో వాడేందుకు నాసా తోపాటు యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ శాస్త్రవేత్తలు కలిసి వైర్‌ లెస్‌ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు.
►నాసా స్పేస్‌లో ఆల్గే (నాచు)ను ఉపయోగించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుండగా.. పిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ‘బేబీ ఫార్ములా’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
►స్టాన్‌ఫర్డ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్త డోగ్‌ ఎంగెల్‌బర్ట్‌.. నాసా చేసిన ఆర్థిక సాయం, సూచనలతోనే కంప్యూటర్‌ ‘మౌస్‌’ను తయారు చేశారు.
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top