యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్‌కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్‌లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్‌గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్‌ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు.
ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్‌కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్‌డ్‌గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్‌కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.


