ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘చక్కా జామ్’ | Why Delhi Taxi Unions Demand Fare Hike After 15 Years, Commuters Face Major Disruptions | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘చక్కా జామ్’

May 21 2026 9:06 AM | Updated on May 21 2026 12:22 PM

Why Delhi Taxi Unions Demand Fare Hike After 15 Years

జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా రవాణా ఛార్జీలను పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం (మే 21) నుంచి మూడు రోజుల పాటు భారీ ‘చక్కా జామ్’(రవాణా బంద్‌) నిరసన ప్రారంభమైంది. వాణిజ్య వాహన సంఘాలు పిలుపునిచ్చిన ఈ సమ్మె మే 23 వరకు కొనసాగనుంది. టాక్సీ ఆపరేటర్లు, ఆటో-రిక్షా డ్రైవర్లతో పాటు పలు రవాణా కమ్యునిటీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఢిల్లీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.

68 యూనియన్లు.. 4 లక్షల టాక్సీలు..

ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్స్‌కు చెందిన దాదాపు 68కి పైగా అనుబంధ యూనియన్లు ఈ మూడు రోజుల ఆందోళనలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది రిజిస్టర్డ్ టాక్సీ యజమానులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రయాణికులను చేరవేసే సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్లు ప్రకటించాయి.

ప్రభావితం కానున్న సేవలు

ఈ సమ్మె కారణంగా సాధారణ ఆటో-రిక్షాలు, కమర్షియల్ టాక్సీ సర్వీసులతో పాటు ప్రముఖ యాప్ ఆధారిత క్యాబ్ ప్లాట్‌ఫామ్‌లైన ఓలా, ఉబెర్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అయితే, ఢిల్లీ మెట్రో, డీటీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

డిమాండ్లు ఇవే..

ఈ వారం ప్రారంభంలోనే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు, ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు తమ డిమాండ్లతో కూడిన లేఖలను పంపింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..గత 15 ఏళ్లుగా టాక్సీ ఛార్జీలను పెంచలేదని, తక్షణమే ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో నడుస్తున్న వాణిజ్య వాహనాలపై ఉన్న ఆంక్షలను సమీక్షించాలి. ‘గత దశాబ్దంన్నర కాలంగా ఛార్జీల నిర్మాణం మారలేదు. కానీ సీఎన్జీ ధరలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్ ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పదేపదే చర్చలు జరిపినా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవడం లేదు’ అని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దిగిరాకపోతే..

ట్రావెల్‌ ఆపరేటర్ల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. రాబోయే రెండు వారాల్లోగా ప్రభుత్వం ఛార్జీల సవరణను ప్రకటించకపోతే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని రవాణా సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement