Virat Kohli: అమ్మకానికి విరాట్‌ కోహ్లి కారు ? ధర ఎంతంటే

Virat Kohli Lamborghini Gallardo Spyder Is Up For Sale - Sakshi

Virat Kohli Lamborghini Gallardo Spyder: టీమిండియా స్కిప్పర్‌ పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ముచ్చటపడి కొనుకున్న సూపర్‌కారు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. లగ్జర్లీ కార్లంటే మోజున్న వారు, సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులు సొంతం చేసుకోవాలనే ఇంట్రస్ట్‌ ఉన్న వారు రెడీగా ఉండాల్సిన సమయం వచ్చింది. 

2015లో
క్రికెట్‌లో తన బ్యాటుతో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సమయంలో 2015లో లగ్జరీ సెగ్మెంట్‌కి చెందిన లంబోర్గిని గలార్డో స్పైడర్‌ మోడల్‌ కారుని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు ఈ కారుని వాడిన తర్వాత విరాట్‌ దాన్ని 2017లో అమ్మేశాడు. అలా ఆ కారు చాలా కాలం పాటు కొల్‌కతాకు చెందిన ఓ ప్రీమియం కార్ల డీలర్‌ దగ్గర ఉండిపోయింది,.

రాయల్‌ డ్రైవ్‌
తాజాగా విరాట్‌ కాడిన కారు గురించి తెలిసిన రాయల్‌ డ్రైవ్‌ సంస్థ ఆ కారుని కోల్‌కతాకు చెందిన డీలర్‌ నుంచి 2021 జనవరిలో కొనుగోలు చేసింది, ప్రస్తుతం ఈ కారుని అమ్మాలని ఆ సంస్థ నిర్ణయించింది. కారుకి రూ.1.35 కోట్లు ధరగా నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మేరకు రాయల్‌డ్రైవ్‌ వెబ్‌సైట్‌లో ఈ కారు అమ్మకానికి సిద్ధంగా ఉంది. 

కండీషన్డ్‌ కారు
విరాట్‌ ఉపయోగించినట్టుగా చెబుతున్న లంబోర్గిని కారు 2013 మోడల్‌కి చెందినది. ఈ కారు ఇప్పటి వరకు కేవలం 10,000 కిలోమీటర్ల మాత్రమే తిరిగింది. కేవలం నాలుగు సెకన్లలోనే వంద కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఈ సూపర్‌ కారు పెట్రోల్‌ ఇంజన్‌లో ఆటోమేటిక్‌ వెర్షన్‌కి సంబంధించినది. లీటరు పెట్రోలుకి 5 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ ఏడాది చివరితో ఇన్సురెన్సు ముగిసిపోనుంది.

గలార్డో స్పైడర్‌
లంబోర్గిని గలార్డో మోడల్‌ని 2005లో ప్రవేశ పెట్టగా చివరి మోడల్‌ని 2014లో రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత ఈ మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేసింది. చివరి సారి ఈ మోడల్‌ ధర రూ. 2.78 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో లంబోర్గిని ఊరూస్‌ మోడల్‌ రన్నింగ్‌లో ఉంది. ఈ సూపర్‌ లగ్జరీ కారు ధర రూ. 3.5 కోట్ల వరకు ఉంటుంది. 

వాస్తవమేనా?
లంబోర్గిని కారుని విరాట్‌ కోహ్లీ 2015లో కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్‌, ఇన్‌స్టాలలో వాటి ఫోటోలను షేర్‌ చేశారు. అందులో కారు నలుపు రంగులో కనిపిస్తుంది. తాజాగా కోహ్లీ వాడినట్టుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న కారు ఆరెంజ్‌ రంగులో ఉంది. రిజిస్ట్రేషన్‌ నంబరు సైతం పుదుచ్చేరి మీద ఉంది. విరాట్‌ ఈ కారుని అమ్మేసిన తర్వాత తాజాగా వార్తల్లో నిలిచే వరకు ఈ కారుకు సంబంధించిన వివరాలు పూర్తిగా అందుబాటులో లేవు. 

చదవండి : టి20లకు సారథ్యం వహించను: కోహ్లి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top