
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విజయవంతమైతే ప్రస్తుత అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని, ఎగుమతులు ఇతోధికం అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. భారత్‌పై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌లను 90 రోజుల పాటు (జూలై 8 వరకు) అమెరికా నిలిపివేయడం తెలిసిందే. దీంతో ఆలోపే అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు భారత్ విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తోంది. తద్వారా భారత ఎగుమతులపై టారిఫ్‌ల పూర్తి మినహాయింపు ప్రయోజనం పొందొచ్చని భావిస్తోంది.
అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడులకు భారత్ ఎంతో విశ్వసనీయ, ఆశావహ కేంద్రంగా కొనసాగుతుందని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. మధ్యకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తాయని అంచనా వేసింది. నైపుణ్యాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న విధానపరమైన చర్యలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ సంస్థల నివేదికలను ప్రస్తావించింది.
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ సహా పలు సంస్థలు 2025–26లో భారత వృద్ధి రేటు 6.2–6.7 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. బలమైన దేశీ ఆర్థిక మూలాలు, మెరుగైన స్థూల ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీంతో వెలుపలి షాక్‌లను ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలదని పేర్కొంది.
వినియోగం దన్ను..
వినియోగం బలంగా ఉండడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడం, సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం దేశీ వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతలను సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నట్టు వివరించింది. రూపాయి స్థిరంగా ఉండడంతోపాటు బలమైన విదేశీ మారకం నిల్వలు వెలుపలి షాక్‌లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా గత బడ్జెట్‌లో ఆదాయపన్ను భారాన్ని తగ్గించడం, ద్రవ్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయని అంచనా వేసింది. దీంతో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకుని 6.3–6.8 శాతం అంచనాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని తెలిపింది.
ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు ఒక్కటే పుంజుకోవాల్సి ఉన్నట్టు తెలిపింది. ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది. రబీ సాగు సానుకూలంగా ఉండడం, వేసవిలో పంటల సాగుతో రానున్న రోజుల్లో ఆహార వస్తువుల పరంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చని వివరించింది. ఇక నైరుతిలో సాధరణం కంటే అధిక వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతోపాటు, చమురు ధరలు కనిష్టాల్లో ఉండడం ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తాయని అభిప్రాయపడింది.