గూగుల్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఈ సారి రంగంలోకి యూఎస్ ప్రభుత్వం

వాషింగ్టన్: విశ్వాస ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ సర్చ్ ఇంజన్ గూగుల్‌పై యూఎస్ న్యాయ శాఖ, ఎనిమిది రాష్ట్రాలు యాంటీట్రస్ట్ దావా వేశాయి. ఆన్‌లైన్ ప్రకటనల మొత్తం పర్యావరణ వ్యవస్థపై గూగుల్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలని వర్జీనియాలోని అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టులో వేసిన దావాలో కోరాయి. ప్రకటనకర్తలు, వినియోగదార్లు, యూఎస్ ప్రభుత్వానికి కూడా ఈ గుత్తాధిపత్యం బాధాకరమైన భారంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించాయి.
కంపెనీల కొనుగోళ్ల ద్వారా ఆన్‌లైన్ ప్రకటన మార్కెట్లో ప్రత్యర్థులను తటస్థీకరించడం, తొలగించడం, లేదా పోటీదార్ల ఆఫర్లను ఉపయోగించడం కష్టతరం చేయడం ద్వారా.. ప్రకటనకర్తలు గూగుల్ ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించేలా ఆ సంస్థ చూస్తోందని ప్రభుత్వం తన ఫిర్యాదులో ఆరోపించింది. ‘గుత్తాధిపత్యం ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన స్వేచ్ఛా, న్యాయమైన మార్కెట్లను బెదిరిస్తుంది.
అవి ఆవిష్కరణలను అణిచివేస్తాయి. ఉత్పత్తిదార్లను, కార్మికులను బాధిస్తాయి. అలాగే వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయి. 15 ఏళ్లుగా పోటీ వ్యతిరేక ప్రవర్తనను గూగుల్ అనుసరించింది. ఇది ప్రత్యర్థి సాంకేతికతల వృద్ధిని నిలిపివేసింది’ అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ వ్యాఖ్యానించారు. కాగా, యోగ్యత లేని దావా అంటూ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ స్పష్టం చేసింది. తమను తాము రక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ‘లోపభూ యిష్ట వాదనను ఈ దావా రెట్టింపు చేస్తుంది. ఇది ఆవిష్కరణలను నెమ్మదిస్తుంది. ప్రకటనల రుసుమును పెంచుతుంది. వేలాది చిన్న వ్యాపారాలు, ప్రచురణకర్తలు వృద్ధి చెందడం కష్టతరం చేస్తుంది’ అని తెలిపింది.
చదవండి: నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!