ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Ups and Downs of Initial Public Offerings on Not Profits - Sakshi

రాబడుల పంట పండుతుందన్న గ్యారెంటీ లేదు

నష్టాలకూ సిద్ధపడాల్సిందే...

ధరలపై డిమాండ్‌–సప్లయ్‌ ప్రభావం

ఫండమెంటల్స్‌ ఆధారంగా పెట్టుబడి

దీర్ఘకాలానికైతే ఆందోళన అక్కర్లేదు

‘ఫోమో’ అస్సలు పనికిరాదు

లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్‌ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్‌ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్‌ మార్కెట్‌ యూటర్న్‌ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి.

గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్‌ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్‌లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది...

జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్‌ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్‌ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్‌ దామోదరన్‌ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది.

ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్‌ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్‌ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్‌ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్‌ పండితుల సూచన.
   
2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్‌ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్‌ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్‌ఎన్‌ఐలు) డబుల్‌ డిజిట్‌లో సబ్‌స్క్రయిబ్‌ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్‌’ డైరెక్టర్‌ అర్జున్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్‌ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి.

ఎన్నో ఉదాహరణలు...
ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్‌ (పీబీ ఫిన్‌టెక్‌) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతోంది. నైకా (ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్‌ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థ ఫార్మ్‌ఈజీని ప్రమోట్‌ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్‌ కూడా నష్టాల్లో నడుస్తున్నదే.

ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్‌ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్‌ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్‌ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు.

అంతెందుకు ఎల్‌ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్‌ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్‌ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్‌ అవుతోంది. ఎల్‌ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్‌ సంస్థ. ఆ రంగంలో లీడర్‌. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులకుతోడు, ఎల్‌ఐసీ అధిక వ్యాల్యూషన్‌పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు.

ఎందుకంటే..?
ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆస్తాజైన్‌ పేర్కొన్నారు.

వీటి వైపు చూడొచ్చా..?
కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్‌ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్‌ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో బ్రేక్‌ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు.

దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్‌ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్‌ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రకటించింది. పేటీఎం, ఎల్‌ఐసీకి మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. పాలజీబజార్‌కు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్‌ పేర్కొన్నారు.

మిస్‌ అయిపోతామన్న భయం వద్దు
ఒక స్టాక్‌ను మిస్‌ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్‌ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ‘టీబీఎంజీ క్యాపిటల్‌’ వ్యవస్థాపకుడు తరుణ్‌ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్‌ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేస్తే, లిస్టింగ్‌ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్‌ గోయల్‌ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.
  ∙
కొందరు లిస్టింగ్‌ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్‌ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్‌ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్‌ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్‌ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్‌ కంపెనీల్లో రిస్క్‌ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్‌ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్‌ రిస్క్‌కే పరిమితం కావాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top