పతన బాటలో యూపీఎల్‌- ఐఆర్‌సీటీసీ 

UPL- IRCTC shares plunges on heavy selling - Sakshi

నిధులు మళ్లింపుపై ప్రజావేగు ఆరోపణలు

16 శాతం కుప్పకూలిన యూపీఎల్‌ షేరు

ప్రభుత్వ వాటా విక్రయానికి ఓఎఫ్‌ఎస్‌ షురూ

13 శాతం పతనమైన ఐఆర్‌సీటీసీ కౌంటర్‌

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 354 పాయింట్లు పతనమైంది. 45,749కు చేరింది. నిఫ్టీ సైతం 106 పాయింట్ల నష్టంతో 13,423 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వార్తల కారణంగా సస్యరక్షణ ప్రొడక్టుల దిగ్గజం యూపీఎల్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ప్రభుత్వ వాటా విక్రయానికి ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ప్రారంభంకావడంతో పీఎస్‌యూ కంపెనీ ఐఆర్‌సీటీసీ కౌంటర్లోనూ అమ్మకాలు పెరిగాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ మార్కెట్లను మించి భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం..  (ఈ షేర్లు- రేస్‌ గుర్రాలు)

యూపీఎల్‌
అగ్రి ప్రొడక్టుల దిగ్గజం యూపీఎల్‌ ప్రమోటర్లు అక్రమమార్గంలో కంపెనీ నిధులను మళ్లించినట్లు ప్రజావేగు ఫిర్యాదు చేశారు. డొల్ల కంపెనీల ద్వారా అద్దె ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సొంత ఉద్యోగుల పేరుతో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీకి కోట్లకొద్దీ సొమ్మును చెల్లించినట్లు ఆరోపించారు. ఈ కంపెనీ గతంలో యూపీఎల్‌ చీఫ్‌ జైదేవ్‌ ష్రాఫ్‌కు చెందిన సంస్థగా ఆరోపించారు. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలంటూ యూపీఎల్‌ సీఈవో జై ష్రాఫ్‌ ఖండించారు. ఆడిటర్లు లావాదేవీలను సమీక్షించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యూపీఎల్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 16 శాతం కుప్పకూలి రూ. 416కు చేరింది. ప్రస్తుతం కాస్త కోలుకుంది. 12 శాతం నష్టంతో రూ. 434 వద్ద ట్రేడవుతోంది. (తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌- పరీక్షలకు రెడీ)

ఐఆర్‌సీటీసీ
ఐఆర్‌సీటీసీలో ప్రభుత్వం 20 శాతం వరకూ వాటాను విక్రయించేందుకు వీలుగా ఓఎఫ్‌ఎస్‌ ప్రారంభమైంది. ఇందుకు కంపెనీ రూ. 1,367 ఫ్లోర్‌ ధరను నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వం తొలుత 15 శాతం వాటా(2.4 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్‌కు అధిక స్పందన లభిస్తే మరో 5 శాతం వాటా(8 మిలియన్‌ షేర్లు) సైతం అమ్మే ఆప్షన్‌ను ఎంచుకుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 1,618తో పోలిస్తే ఆఫర్‌ ధర 16 శాతం డిస్కౌంట్‌ కావడం గమనార్హం. దీంతో ఐఆర్‌సీటీసీ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13 శాతంపైగా పతనమైంది. రూ. 1,405కు చేరింది. ప్రస్తుతం కాస్త రికవరైంది. 8.2 శాతం నష్టంతో రూ. 1,485 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో ప్రభుత్వానికి 87.4 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం ప్రమోటర్ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉండటంతో ఓఎఫ్‌ఎస్‌కు తెరతీసినట్లు నిపుణులు తెలియజేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ శుక్రవారం అందుబాటులోకి రానుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top