Union Budget Facts: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?

Union Budget history and interesting facts here is details - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్  ప్రవేశపెట్టడం ఆనవాయితీగా  వస్తోంది.  స్వాతంత్య్రానికి  1860 ఏప్రిల్ నెలలో తొలిసారి భారత బడ్జెట్ ను జేమ్స్ విల్సన్ ప్రవేశ పెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్‌కు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.  స్వాతంత్య్రానంతరం తొలి బడ్జెట్  ఘనత ఆర్కే షణ్ముగం దక్కించుకున్నారు. 1947 నవంబర్‌లో ఆయన తొలి దేశీయ ఆర్థిక మంత్రి కావడం గమనార్హం. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు ఈ బడ్జెట్  కొనసాగింది.  ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

(Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్‌!)

పుట్టిన రోజునాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత
ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొరార్జీ దేశాయి ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  10సార్లు ఆయన బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం గమనార్హం.అంతేకాదు 1964,1968 సంవత్సరాల్లో (ఫిబ్రవరి, 29 ) రెండుసార్లు ఆయన పుట్టినరోజునాడే  బడ్జెట్‌ను తీసుకురావడం విశేషం. 

బ్లాక్‌ బడ్జెట్‌
మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్లాక్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  రూ.550 కోట్ల లోటు కారణంగా 1973-74 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్ బ్లాక్ బడ్జెట్‌గా నిలిచింది. (ముచ్చటగా మూడోసారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌: ఎపుడు, ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?)

ఆర్థికమంత్రిగా, ఆతర్వాత రాష్ట్రపతిగా: ప్రణబ్‌ ముఖర్జీ, ఆర్ వెంకట్రామన్‌లు ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాతికాలంలో వీరిద్దరూ రాష్ట్రపతులుగా దేశానికి సేవలందించారు. అలాగే రెండు రకాల క్లిష్ట సమయాల్లో రెండు ప్రభుత్వ హయాంలలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టడం మరో విశషం. పోఖ్రాన్ రెండో పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లో, గుజరాత్‌లో భూకంపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశంత్ సిన్హా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు.

రైల్వే బడ్జెట్‌, సాధారణ బడ్జెట్‌
1924లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. రెండు బడ్జెట్‌లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు.  కానీ ఆ తరువాత  92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , 2017 నుంచి ప్రస్తుతం దాకా  రెండు బడ్జెట్లను కలిపి మోడీ  సర్కార్‌  తీసుకొస్తోంది.

బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు
ప్రధానులుగా ముగ్గురు అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా బడ్జెట్‌ను తీసుకురావడం విశేషం.

పేపర్‌ లెస్‌ బడ్జెట్‌
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను పరిచయం చేశారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్  కాలంలో 2021నుంచి కాగిత రహిత డిజిటల్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో చూడొచ్చు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చివరి  బడ్జెట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top