ఏప్రిల్‌ 1 విడుదల... ధర దడ | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 విడుదల... ధర దడ

Published Fri, Mar 12 2021 4:07 AM

TV Prices To Rise From April As Open-Cell Panels Costlier In Global Market - Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్‌–సెల్‌ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్‌ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్‌ ఉంది. టీవీ స్క్రీన్‌ తయారీలో ఓపెన్‌–సెల్‌ ప్యానెల్‌ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్‌ ప్యానెళ్లను ఓపెన్‌–సెల్‌ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్‌–సెల్‌ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్‌ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్‌ అండ్‌ సల్లివాన్‌ అంచనా.

మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్‌ ఇండియా, సౌత్‌ ఆసియా ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు. ఓపెన్‌–సెల్‌ ప్రైస్‌ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్‌ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్‌–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్‌జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోం అప్లయెన్సెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ బాబు తెలిపారు.

వాటికి కొరత ఉన్నందునే..
మార్కెట్లో ఓపెన్‌–సెల్‌ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్‌ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్‌ కంపెనీ థామ్సన్, యూఎస్‌ సంస్థ కొడాక్‌ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని  వీడియోటెక్స్‌ ఇంటర్నేషనల్‌  డైరెక్టర్‌ అర్జున్‌ బజాజ్‌ చెప్పారు.

Advertisement
Advertisement