
సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు
హైదరాబాద్: ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యాన్ని చాటుతూ గడిచిన ఏడాదిలోనే రూ.54,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో స్థానం సంపాదించుకుంది. ఇలా ఘనత చాటిన భారతదేశం నుంచి ఏకైక నగరంగా నిలిచింది.
ఈ పెట్టుబడులు ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, సెల్ & జీన్ థెరపీ, మెడికల్ డివైసెస్, వ్యాక్సిన్లు, డిజిటల్ హెల్త్ వంటి విభాగాల్లో వచ్చాయి. ఈ పెట్టుబడులు 2 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే వీలుంది. ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పురోగతిపై తాజాగా జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ బోర్డు సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.
ఇన్నోవేషన్ ఆధారిత లైఫ్ సైన్సెస్ కు తెలంగాణ ప్రపంచ కేంద్రంగా అవతరించిందని, ప్రస్తుతం 2000 లైఫ్ సైన్సెస్ కంపెనీలకు నిలయంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టాప్ 7 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ ఆవిర్భవించడం తెలంగాణ ప్రగతిశీల విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, టాలెంట్ రిచ్ ఎకోసిస్టమ్ ప్రత్యక్ష ఫలితం అన్నారు. ప్రతిపాదిత లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గా ప్రపంచస్థాయి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.