రూ .1.8 కోట్ల జీతం.. భలే జాబ్‌ కొట్టాడు!! | Techie lands Rs 1 8 crore global job Software Engineers Viral Success | Sakshi
Sakshi News home page

రూ .1.8 కోట్ల జీతం.. భలే జాబ్‌ కొట్టాడు!!

Apr 3 2026 4:23 PM | Updated on Apr 3 2026 6:44 PM

Techie lands Rs 1 8 crore global job Software Engineers Viral Success

విదేశీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కన్సల్టెన్సీలు, విదేశాల్లో నెట్‌వర్కింగ్, లేదా అక్కడే చదువుకుని ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఏ విధమైన విదేశీ కనెక్షన్లు లేకుండా, కేవలం తన గదిలో కూర్చుని పక్కా ప్రణాళికతో రూ. 1.8 కోట్ల అంతర్జాతీయ జాబ్‌ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు కార్తీక్ మోడీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఈ వార్త టెక్ నిపుణుల్లో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తోంది.

అసాధ్యం కాదు..
తొలుత ఇండియాలో ఉంటూనే రిమోట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కార్తీక్, ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాతే యూకేకి మకాం మార్చారు. ‘విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద నెట్‌వర్క్ ఉండటం ముఖ్యం కాదు. సరైన నైపుణ్యం, స్పష్టమైన ప్రణాళిక ఉంటే మీ గది నుంచే ప్రపంచాన్ని గెలవొచ్చు’ అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కార్తీక్ మోడీ సక్సెస్ మంత్రం ఇదే..
గుడ్డిగా వందలాది కంపెనీలకు దరఖాస్తు చేయకుండా, కేవలం 25-30 అంతర్జాతీయ కంపెనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వీసా స్పాన్సర్‌షిప్ ఇచ్చే కంపెనీల కోసం లింక్డ్‌ఇన్, ఇండీడ్, లెవల్స్‌.ఫై వంటి వేదికలను ఉపయోగించుకున్నారు.

సుమారు 40 ఉద్యోగ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి, అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఆశిస్తున్న నైపుణ్యాలను గుర్తించి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఇందు ​కోసం 12 వారాల పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొదటి 5 వారాలు డేటా స్ట్రక్చర్స్ & అల్గోరిథమ్స్ పై పట్టు సాధించారు. వేల సమస్యలు కాకుండా, కేవలం 100 కీలకమైన సమస్యలను ఎంచుకుని, వాటి వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకున్నారు.

సిస్టమ్ డిజైన్‌పై పట్టు సాధించేందుకు పేమెంట్స్, సెర్చ్, నోటిఫికేషన్స్ వంటి 8-10 కీలక కోర్ సిస్టమ్స్‌పై లోతైన అధ్యయనం చేశారు. రియల్ వరల్డ్ ప్రాజెక్టులలో స్కేలబిలిటీ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రాక్టీస్ చేశారు.

రిజ్యూమ్ చిన్నగా.. ఇంపాక్ట్ పెద్దగా!
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కేవలం ఒకే ఒక్క పేజీలో తన రిజ్యూమ్‌ను రూపొందించారు. సుదీర్ఘమైన వివరణలు ఇవ్వకుండా, తాను చేసిన పని వల్ల కలిగిన ఫలితాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. ఇంటర్వ్యూ భయం పోగొట్టుకోవడానికి పలు 'మాక్ ఇంటర్వ్యూలు' కూడా నిర్వహించుకున్నారు.

ఏ విధమైన షార్ట్‌కట్‌లు వెతక్కుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే ప్రపంచస్థాయి అవకాశాలు మన ముంగిటకే వస్తాయని కార్తీక్ మోడీ నిరూపించారు. కేవలం 10-12 వారాల కఠోర శ్రమ ఆయన జీవితాన్నే మార్చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement