
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు రాజీనామాలు, ముందస్తు రిటైర్‌మెంట్‌లు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీసీఎస్‌లో సుదీర్ఘకాలంగా ఉద్యోగిగా పనిచేసిన తమ సోదరుడిని ముందస్తు పదవీ విరమణ చేయించడమే కాకుండా, సెవెరెన్స్ పే లేదా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదని ఒక వ్యక్తి పేర్కొన్నారు. ఆ వ్యక్తి తమ సోదరుడికి జరిగిన విషయాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు.
"టీసీఎస్ ఉద్యోగిని 30 సంవత్సరాల తరువాత ముందస్తు పదవీ విరమణకు బలవంతం చేశారు. తొలగింపు వేతనం లేదు, పరిహారం లేదు" అని రెడ్డిట్ యూజర్ (silver_traveller) పేర్కొన్నారు. తన సోదరుడు తన జీవితంలో దాదాపు 30 ఏళ్లను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అంకితం చేశాడని 'వర్క్ ప్లేస్ టాక్సిసిటీ' ట్యాగ్ కింద షేర్ చేసిన ఈ ఘటన పేర్కొంది.
రిటైర్ అవుతావా.. తొలగించమంటావా?
30 ఏళ్లుగా కంపెనీకి విధేయుడిగా ఉన్న తమ సోదరుడికి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని రెడిట్ యూజర్ ఆరోపించారు. 2025 జూన్‌లో ఆయనను ఒక సమావేశానికి పిలిపించి, తొలగిస్తున్నట్లు చెప్పారని, ముందస్తు పదవీ విరమణను స్వీకరించడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.. రెండిటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోవాలని సరిగ్గా 20 నిమిషాలే సమయం ఇచ్చారని వాపోయారు.
50 ఏళ్ల వయసున్న తమ సోదరుడు ఇప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులకు ప్రతికూలంగా ఉన్న జాబ్ మార్కెట్లో పరిమిత ఉద్యోగావకాశాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెడిట్ పోస్టుకు ఫాలోవర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు బాధిత ఉద్యోగికి మద్దతుగా, టీసీఎస్ వైఖరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.
కాగా టీసీఎస్ లో బలవంతపు రాజీనామా, అక్రమ తొలగింపుకు వ్యతిరేకంగా పలువురు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఇటీవలే వీధుల్లోకి వచ్చారు. నోయిడా, కోల్ కతాలో ఆలిండియా ఐటీ, ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. నిరసనలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, "టీసీఎస్ తొలగింపును ఆపండి, లేకపోతే ప్రతిఘటన మరింత గట్టిగా పెరుగుతుంది" అని ఏఐఐటీఈయూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
IT/ITeS employees across India hit the streets on 5 Sept against #ForcedResignation & #IllegalTermination in #TCS. Protests in Noida & Kolkata sent a clear message: #TCSstopRetrenchment or the resistance will grow louder. ✊ #JoinAIITEU pic.twitter.com/NidRgsU3Xy
— AIITEU (@aiiteu) September 6, 2025