డిఫెన్స్ థీమ్... షేర్లు జూమ్
ఐదారు నెలల్లోనే ఆరేడు రెట్లు పెరిగిపోయిన షేర్లు
డిఫెన్స్ రంగంలో లీడర్లను మించి భారీగా పెరుగుదల
షేర్ల రైజింగ్‌తో పోలిస్తే ఆమడ దూరంలో ఆదాయం
200–320 పీఈ వద్ద కూడా ట్రేడవుతున్న కొన్ని షేర్లు
ఇలాంటివి కొంటే కరెక్షన్‌లో ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ
డిఫెన్స్ రంగంలో ఆర్డర్లున్నా అమలుకు దీర్ఘకాలం పట్టే అవకాశం
కొన్నిసార్లు అమల్లో లోటుపాట్లుంటే మొత్తానికే తల్లకిందులు
స్టాక్ మార్కెట్లో తరచూ కొన్ని థీమ్‌లు మెరుస్తాయి. భవిష్యత్తు అద్భుతమంటూ బ్రోకరేజ్ కంపెనీలు కొన్ని రంగాల స్టోరీలు తెరపైకి తెస్తాయి. మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వ ఫోకస్, కంపెనీలు పెట్టే ఖర్చు... వీటి ఆధారంగా ఈ స్టోరీని అల్లుతారు. వీటికి నిపుణుల సిఫారసులు తోడవుతాయి. దీంతో ఆ రంగంలోని షేర్లు దూసుకుపోతాయి. సహజంగానే ఆ రంగంలోని దిగ్గజాలు ఆ ర్యాలీని లీడ్ చేస్తూ ఉంటాయి.
తమాషా ఏంటంటే... అదే థీమ్ ముసుగులో ఆ రంగానికి చెందిన చిన్నాచితకా కంపెనీలు కూడా రివ్వుమంటాయి. ఫండమెంటల్స్ ఏమాత్రం లేని షేర్లు లీడర్లను మించిపోతుంటాయి. ఇదే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆపరేటర్ల హస్తవాసితో దూసుకెళ్లే షేర్ల జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళితే... ఆ తరవాత పతనంలో అమ్ముకోవటం అంత తేలిక్కాదు.
ఇదంతా ఎందుకంటే... ఇపుడు మన మార్కెట్లో డిఫెన్స్, ఏరోస్పేస్ థీమ్ నడుస్తోంది. ఏడాదిగా ఈ రంగంలోని షేర్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. షేరు పీఈ (షేరుకు ఆర్జన) ఏకంగా 150–200 దాటిపోతోంది కూడా. అంటే... ఆ కంపెనీ ఇంకో 200 ఏళ్లలో సంపాదించే ఆదాయానికి తగ్గట్టుగా ఆ షేరు ఇప్పుడే పెరిగిపోయిందన్న మాట. మరి ఇలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తపడాలి కదా? అదెలాగో వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...
ఒకే ఒక్క ఏడాదిలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ఉన్న, ఉన్నట్లు చెబుతున్న పలు షేర్లు రెండు, మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ రంగం లాంగ్‌టర్మ్ పటిష్ఠంగానే ఉంది. కొన్ని కంపెనీల ఆర్డర్ బుక్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఒక రంగం బాగుందంటే దానర్థం ఆ రంగంలోని షేర్లను ఏ ధర పడితే ఆ ధరకు కొనొచ్చని కాదు కదా? ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదేమిటంటే మొదట స్టోరీ.
దాంతో భారీగా రీ–రేటింగ్. ఫండ్లు, ఆ రంగంపై అవగాహన ఉన్నవారు, సమాచారం తెలిసినవారు ముందుగా ఆయా షేర్లు కొంటారు. ఇదంతా స్మార్ట్ మనీ. షేర్లు పెరుగుతాయి. అప్పుడు రిటైలర్లు కొంటారు. ఇంకా పెరుగుతాయి. ఇక దొరకవేమోనన్న భయంతో మరికొందరు రిటైలర్లు దూకుతారు. వేల్యుయేషన్లు పెరిగిపోతాయి. కరెక్షన్ ఆరంభం. అయితే ధర తగ్గటం... లేదా దీర్ఘకాలంపాటు అక్కడే కదలటం. ఇలా ఏ రకంగానైనా దెబ్బతినేది ఆలస్యంగా కొన్న రిటైలర్లే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలో చూద్దాం...
1. ఆర్డర్ బుక్ భారీగా ఉన్నా...
→ డిఫెన్స్ వ్యవహారాల్లో ఎగ్జిక్యూట్ కావటానికి దీర్ఘకాలం... అంటే 3–5 ఏళ్లు పడుతుంది.
→ ఎగ్జిక్యూషన్ రిసు్కలు ఎక్కువ. ఆర్డర్లన్నీ ఆచరణలోకి రాకపోవచ్చు కూడా.
2. ప్రభుత్వ ప్రీమియం పెరుగుతోంది...
→ చారిత్రకంగా చూస్తే ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు 10–20 పీఈ మధ్య ట్రేడయ్యేవి.
→ ఇపుడైతే వాటి చారిత్రక విలువల కన్నా 5–10 రెట్లు ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతున్నాయి.
2. ఆర్జనను మించి షేరు పరుగు...
→ ఈ కంపెనీల ఆదాయాలు ఏటా 20 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి.
→ కానీ ఈ కంపెనీల షేర్ల విలువ ఏడాదిలో 200–300 శాతం పెరిగిపోతోంది.
ఇలాగైతే జాగ్రత్త...
→ స్టాక్ నిట్టనిలువుగా పెరుగుతూ వచ్చిందంటే... కొనేముందు ఆలోచించండి.
→ స్టాక్ ధర ఎంత ఉంది? దాని ఆదాయం ఎంత పెరుగుతోంది? అనేది చూడండి.
→ నిదానంగా కొనటం ముఖ్యం. ఒకేసారి మొత్తం కొంటే తరవాత కష్టం.
చెయ్యాల్సిందేంటి?
→ కరెక్షన్ కోసం చూడండి. ఎందుకంటే షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. కనీసం 30–40 శాతం తగ్గేదాకా ఎదురుచూడండి.
→ షేరు ధర కన్నా... కంపెనీ ఆదాయం పెరుగుదలపై ఫోకస్ పెట్టండి.
→ వేగంగా పెరుగుతున్న చిన్న షేర్ల కన్నా... లీడర్లపై దృష్టిపెట్టండి.
లోకల్ కంపెనీల డ్రీమ్ రన్... జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటార్ టెక్నాలజీస్, అపోలో మైక్రో సిస్టమ్స్, సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, బొందాడ ఇంజినీరింగ్ వంటి షేర్లు డిఫెన్స్ థీమ్‌తో ఇటీవల బీభత్సంగా ఎగిశాయి. ఎంటార్ షేరు ఏకంగా రెండుమూడు నెలల వ్యవధిలోనే 3–4 రెట్లు పెరిగిపోయింది. ఆదాయాలకు మించి పెరుగుతున్న ఇలాంటి షేర్లలో కరెక్షన్ వస్తే అది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి రిటైలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది.
ఇవీ.. డిఫెన్స్‌లో లీడర్లు
→ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
→ భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్
→ భారత్ డైనమిక్స్ లిమిటెడ్
షిప్ బిల్డింగ్.. హెవీ డిఫెన్స్‌లో
→ మజగన్ డాక్ షిప్‌బిల్డర్స లిమిటెడ్
→ కొచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
→ గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్
ప్రైవేటు డిఫెన్స్ షేర్లు... (స్మాల్–మైక్రోకాప్)
→ డాటా పాటర్న్స్ ఇండియా
→ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్
→ సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
బాగా పెరిగిన తెలుగు రాష్ట్రాల షేర్లు
→ ఎంటార్ టెక్నాలజీస్
→ అజాద్ ఇంజినీరింగ్
→ బొందాడ ఇంజినీరింగ్
→ సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (ఒకనాటి మెగాసాఫ్ట్)
→ అపోలో మైక్రో సిస్టమ్స్
(వీటిలో చాలా షేర్లు నిట్టనిలువుగా పెరిగినవని)
పక్క పట్టిక చూస్తే 320 పీఈ వద్ద ట్రేడవుతున్న షేర్లు ఆరు నెలలు తిరక్కుండా ఆరేడు రెట్లు పెరిగిన షేర్లు కనిపిస్తాయి. నెలలోనే రెట్టింపయిన షేర్లూ ఉన్నాయి. మరి వీటి ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగాయా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన జవాబు రాదు. ఆదాయాలు కొంత పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఆదాయాలకు 10 నుంచి 20 రెట్లు షేర్లు పెరిగిపోవ టమే ఆందోళనకరం. రిటైలర్లు ఇలాంటి సమయాల్లో ఇంకా పెరుగుతాయనే ఆశతో ఎంటరయితే పడిపోయే అవకాశమూ ఉంది.
ఎందుకంటే అప్పటిదాకా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. పైపెచ్చు స్టోరీ ఆధారంగా పెరిగిన షేర్లు ఆ స్టోరీ గనక నిజం కాకపోతే నేలచూపులు చూడొచ్చు. అపుడు రిటైల్ ఇన్వెస్ట ర్లు ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. నష్టాలు భారీగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థీమ్‌ల వెంట పరుగులు పెట్టవద్దన్నది నిపుణుల సలహా. ఒకవేళ మీరు గనక థీమ్‌ను బలంగా నమ్మితే... ఆ రంగంలో లీడర్లను ఎంచుకోవాలే తప్ప చిన్నషేర్ల వెంట క్విక్ మనీ కోసం పరుగులు పెడితే ఇబ్బందులేనన్నది గ్రహించాలి. 
(రమణమూర్తి మంథా)


