
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లుతో పాటు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెలకువలతో ట్రెండీ లుక్ తీసుకు రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు.
➤సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తుల స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.300.
➤ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్‌లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. వీటి ధర రూ.3 వేల నుంచి ఉన్నాయి.
➤పండుగ సీజన్‌లో ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహా్నలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్‌ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.200 – 500 మధ్య ఉన్నాయి.
➤రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. వీటి ధర రూ.400 నుంచి ఉన్నాయి.
➤అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్‌లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి.
➤ఈ మధ్య కాలంలో నీళ్లలో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్‌పూల్ వద్ద అమర్చుకోవచ్చు. ఇవి పరిమాణాలను బట్టి 8–10 గంటల వరకు కాంతినిస్తాయి.