మూడోరోజూ రికార్డులే...

Sensex tops 44,000 mark on buying in bank And auto stocks - Sakshi

తొలిసారి 44 వేల పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్‌

నిఫ్టీ లాభం 64 పాయింట్లు 

రాణించిన బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లు 

ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం

ముంబై:  స్టాక్‌ మార్కెట్లో మూడోరోజూ రికార్డుల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడి తొలిసారి 44 వేల పైన 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 12,938 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి 27 పైసలు బలపడటం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతం వార్తలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలోసెన్సెక్స్‌ 262 పాయింట్లు లాభపడి 44,215 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 12,948  వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, టెలికాం రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆర్థిక కంపెనీల యాజమాన్యాలు  వెల్లడించిన అవుట్‌లుక్‌లో...  ఆదాయాలతో పాటు, ఆస్తుల నాణ్యత మెరుగుపడతాయనే వ్యాఖ్యలతో  ఈ రంగ షేర్ల ర్యాలీచేస్తున్నాయని మార్కెట్‌ నిపుణులంటున్నారు. ఇటీవల పతనాన్ని చవిచూసిన ఆటో షేర్లల్లో షార్ట్‌ కవరింగ్‌ జరిగినట్లు వారంటున్నారు.

లక్ష్మీ విలాస్‌.. లోయర్‌ సర్క్యూట్‌
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి వెళ్లిన లక్ష్మీ విలాస్‌ బ్యాంకు షేరు బుధవారం 20 శాతం నష్టపోయి రూ.12.40 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్‌ స్థిరత్వం, ఆర్థిక వ్యవహారాల పటిష్టతల దృష్ట్యా ఆర్‌బీఐ నెలరోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  

6 శాతం లాభపడ్డ ఎల్‌అండ్‌టీ షేరు....
టాటా స్టీల్‌ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో ఎల్‌అండ్‌టీ షేరు  6% లాభపడి రూ.1,148 వద్ద ముగిసింది.  

నాల్కో నుంచి మధ్యంతర డివిడెండ్‌...  
ప్రభుత్వ రంగ అల్యూమినియం తయారీ కంపెనీ నాల్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్‌ రికార్డు ర్యాలీ నేపథ్యంలో అదానీ గ్యాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జుబిలెంట్‌ పుడ్స్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, వైభవ్‌ గ్లోబల్స్‌ షేర్లు జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి.

విప్రో బైబ్యాక్‌.. డిసెంబర్‌ 11
న్యూఢిల్లీ: ప్రతిపాదిత షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కి డిసెంబర్‌ 11 రికార్డ్‌ తేదీగా నిర్ణయించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో వెల్లడించింది. దీని కింద సుమారు రూ. 9,500 కోట్ల దాకా విలువ చేసే షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 400 రేటు నిర్ణయించింది. విప్రో గతేడాది సుమారు రూ. 10,500 కోట్ల దాకా విలువ చేసే షేర్ల బైబ్యాక్‌ నిర్వహించింది. మరో ఐటీ దిగ్గజం  టీసీఎస్‌ రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top