ఐపీవో నిధుల వినియోగానికి కళ్లెం

Sebi to tighten norms for IPO proceeds utilisation - Sakshi

మొండి రుణాల కొనుగోలుకు ప్రత్యేక ఫండ్స్‌

ఎండీ పునర్నియామకానికి తాజా ప్రొవిజన్లు

ఫండ్స్‌ సహా పలు నిబంధనల సవరణ

బోర్డు భేటీలో సెబీ తాజా నిర్ణయాలు

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూ నిధుల వినియోగంసహా మ్యూచువల్‌ ఫండ్‌ తదితర పలు విభాగాలలో నిబంధనలను సవరించింది. మంగళవారం(28న) సమావేశమైన సెబీ బోర్డు ప్రిఫరెన్షియల్‌ షేర్లు, ఫండ్‌ పథకాల నిలిపివేత, సెటిల్‌మెంట్‌ విధానాలు, కంపెనీ ఎండీ పునర్నియామకం, ఒత్తిడిలోపడ్డ రుణాలలో పెట్టుబడులు వంటి పలు మార్గదర్శకాలలో మార్పులకు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు చూద్దాం..

ముందస్తు అనుమతి...
సెబీ తాజా సవరణలు అమలులోకి వచ్చాక కంపెనీ ఎండీ, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ లేదా మేనేజర్‌ ఎంపికకు ఇకపై వాటాదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సాధారణ వాటాదారుల సమావేశంలో తిరస్కారానికి గురైన అధికారుల ఎంపిక లేదా పునర్నియామకానికి ముందస్తు అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇక మార్కెట్లను ముంచెత్తుతున్న పబ్లిక్‌ ఇష్యూలపైనా సెబీ దృష్టి సారించింది.

2022లో మరిన్ని కంపెనీల ఐపీవోల నేపథ్యంలో ఇష్యూ నిధుల విని యోగంపై ఆంక్షలు విధించింది. స్పష్టతలేని కంపెనీయేతర వృద్ధి అవకాశాలకు వినియోగించదలచిన నిధులకు ఇవి వర్తించనున్నాయి. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు ఐపీవోలో విక్రయానికి ఉంచదలచిన షేర్ల సంఖ్యపైనా పరిమితులు అమలుకానున్నాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50%కి లాకిన్‌ పిరియడ్‌ 90 రోజులకు పెరగనుంది. మిగిలిన వాటాకు ప్రస్తుత 30 రోజుల గడువే అమలుకానుంది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించే నిధులపైనా సెబీ పర్యవేక్షణ ఉంటుంది.

కొత్త టెక్‌ ఐపీవోలు..
ఇటీవల కొత్తతరహా టెక్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగుకు వీలుగా ఐపీవోలకు వస్తున్న కంపెనీల ధరల శ్రేణి నిర్ణయంపై ఆంక్షలు ఉండబోవని సెబీ చైర్‌పర్సన్‌ అజయ్‌ త్యాగి స్పష్టం చేశారు. ప్రైస్‌ డిస్కవరీ(ధరల నిర్ణయం) అనేది మార్కెట్‌ ఆధారితమని, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. సెబీ తాజా నిర్ణయాలలో భాగంగా ఒత్తిడిలోఉన్న రుణాల(ఆస్తుల)లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక సిట్యుయేషన్‌ ఫండ్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్‌లు)కు తెరలేవనుంది. కేవలం మొండి రుణాలలో ఇన్వెస్ట్‌ చేసేందుకే వీటిని ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల(ఏఐఎఫ్‌లు)లో ఉపవిభాగం కింద అనుమతించనున్నారు. దివాలా చట్టంలో భాగంగా ఆర్‌బీఐ నిబంధనలు అనుమతించిన మొండి రుణాల కొనుగోలుకే ఎస్‌ఎస్‌ఎఫ్‌కు అవకాశముంటుంది. ఈ బాటలో ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ)లు, ఒత్తిడిలోపడ్డ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలలోనూ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

ప్రిఫరెన్స్‌ షేర్లు
ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే కంపెనీలకు ధరల నిర్ణయం, లాకిన్‌ వంటి అంశాలలోనూ సెబీ నిబంధలను సరళీకరించింది. వీటితోపాటు లాకిన్‌ పీరియడ్‌లో ఉన్నప్పటికీ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో పొందిన షేర్లను ప్రమోటర్లు తనఖాలో ఉంచేందుకు నిబంధనలను సరళీకరించింది. ఇక లిక్విడిటీగల కంపెనీ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూకి ఫ్లోర్‌ ధరను 90–10 రోజుల సగటు ధర కంటే అధికంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇల్లిక్విడ్‌ సెక్యూరిటీ విషయంలో రిజిస్టర్డ్‌ స్వతంత్ర విలు వ మదింపు సంస్థ ఫ్లోర్‌ ధరను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం 2 లేదా గత 26 వారాల్లో అత్యధిక ధరను ఫ్లోర్‌ ధరగా నిర్ణయిస్తుండటం తెలిసిందే.

ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు..
మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూ సెబీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ఎంఎఫ్‌లకు చెందిన మెజారిటీ ట్రస్టీలు ఏవైనా పథకాలను నిలిపివేయదలిస్తే యూనిట్‌ హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసు కోవలసి ఉంటుంది. అంతేకాకుండా 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంఎఫ్‌లు తప్పనిసరిగా దేశీ ప్రమాణాల ప్రకారం ఖాతాలను నిర్వహించవలసి వస్తుంది. ఇక సెటిల్‌మెంట్‌ దరఖాస్తులను కంపెనీలు షోకాజ్‌ నోటీసు జారీ అయిన 60 రోజుల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. అంతర్గత కమిటీ సమావేశం తదుపరి సవరించిన సెటిల్‌మెంట్‌ షరతులను 15 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. తద్వారా సెటిల్‌మెంట్‌ ప్రక్రియల నిబంధనలను క్రమబద్ధీకరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top