
తాజాగా సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్‌ఎస్‌ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ కంపెనీలు సెబీకి ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ
రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ ఐపీవో ద్వారా రూ. 2,700 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయానికి ఉంచనుంది.
ఆనంద్ రాఠీ
ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకింగ్ సరీ్వసుల విభాగం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీవోలో భాగంగా రూ. 745 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న రూ. 745 కోట్లలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
ఎస్‌ఎస్‌ఎఫ్ ప్లాస్టిక్స్
పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్‌ఎస్‌ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్
పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయ నున్నారు. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్‌లోని అల్వార్‌లోగల జిలోత్ ఇండ్రస్టియల్ ఏరియాలో తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోగల ప్లాంటు విస్తరణతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది.
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ
ఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుసహా.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు, వడోదరలో రోబోటిక్స్ పరికరాలతోపాటు కొత్త ఆసుపత్రి ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది.