Water To Gold: నీళ్లూ బంగారమవుతాయ్​.. చేసి చూపించిన సైంటిస్టులు!

Scientists Just Turned Water Into Gold Few Seconds - Sakshi

నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్‌తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది  కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్‌ రిపబ్లిక్‌ సైంటిస్టులు. 

ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన‍్నది ఎప్పటి నుంచో ఉన్నదే.  అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి.

నీటి విషయంలో.. 
నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. 

సిరంజీ సాయంతో.. 
పిరియాడిక్ టేబుల్‌లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్‌ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది.
 

రిస్క్‌ ఉంది
అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్‌’ జర్నల్‌లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్‌ పబ్లిష్‌ అయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top