బస్‌ ట్రావెల్‌కు చిన్న నగరాల దన్ను | redBus operates services on 1 lakh routes across Telugu states: redBus CEO Prakash Sangam | Sakshi
Sakshi News home page

బస్‌ ట్రావెల్‌కు చిన్న నగరాల దన్ను

Jul 3 2026 5:00 AM | Updated on Jul 3 2026 5:00 AM

redBus operates services on 1 lakh routes across Telugu states: redBus CEO Prakash Sangam

తెలుగు రాష్ట్రాల్లో 1 లక్ష రూట్లలో సర్వీసులు 

ఆధ్యాత్మిక కేంద్రాలపై జెన్‌ జెడ్‌ ఆసక్తి 

రెడ్‌బస్‌ సీఈవో ప్రకాశ్‌ సంగం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి బస్సు ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోందని రెడ్‌బస్‌ సీఈవో ప్రకాశ్‌ సంగం తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో దాదాపు 1 లక్ష రూట్లలో రెడ్‌ బస్‌ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించారు. ఇంటర్‌సిటీ బస్‌ ట్రావెల్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీలకంగా ఉంటున్నాయని, గత ఆర్థిక సంవత్సరం తమ వ్యాపారంలో ఈ ప్రాంత వాటా 16 శాతంగా ఉందని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి తెలిపారు. సీట్ల బుకింగ్, వ్యాపారపరంగా గత ఆర్థిక సంవత్సరం 18 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.

కొత్తగా డిమాండ్‌ ఏర్పడుతున్న ప్రాంతాలు, అంతగా సేవల్లేని ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడంపై మరింతగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఆధ్యాతి్మక కేంద్రాలపై జెన్‌ జెడ్‌ ఆసక్తిగా ఉంటోందని పేర్కొన్నారు. సదరు ప్రాంతాలకు జెన్‌ జెడ్‌ ప్రయాణికుల సంఖ్య 37 శాతం, మహిళా ట్రావెలర్ల సంఖ్య 39 శాతం మేర పెరిగిందని ప్రకాశ్‌ చెప్పారు. తిరుపతి, తిరువణ్ణామలై, షిరిడి, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు.  
రైళ్లతో పోలిస్తే బస్సులతో వెసులుబాటు.. 

విమానాలను, రైళ్లను ఆధునీకరిస్తూ, మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. బస్సులతో మరిన్ని వెసులుబాట్లు ఉంటున్నాయని, అందుకే ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారని ప్రకాశ్‌ చెప్పారు. ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, పండుగలు.. సెలవుల సీజన్లోనూ బడ్జెట్లోనే సీట్ల లభ్యత, మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ లాంటివి బస్సులకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వివరించారు. ఆపరేటర్లను ఆకర్షించేందుకు రెడ్‌బస్‌ పలు చర్యలు తీసుకుంటోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణాలు గత ఆర్థిక  సంవత్సరంలో 42 శాతం పెరిగినట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణలో 700 రూట్లలో ఈవీలు నడుస్తున్నాయన్నారు.  

5 శాతం పెరిగిన చార్జీలు.. 
రెడ్‌బస్‌ఇండియా బస్‌ ట్రాక్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇంటర్‌సిటీ బస్‌ ట్రావెల్‌కి సంబంధించి గతేడాది అక్టోబర్‌ నుంచి 2026 మార్చి వరకు జాతీయ స్థాయిలో సీటు సగటు ధర రూ. 966గా ఉందని ప్రకాశ్‌ చెప్పారు. ‘నిర్వహణ భారంలో ఇంధన వ్యయాల వాటా ఎక్కువే అయినప్పటికీ ఆయా రూట్లలో సరఫరా–డిమాండ్‌ని బట్టి బస్సు చార్జీలు ఉంటాయి. పశి్చమాసియా పరిణామాలతో ఇంధన ధరలు పెరగడం, దాని ప్రభావంతో సీటు సగటు చార్జీ వార్షికంగా 5% పెరగడాన్ని గమనించాం. ఇంధనాల ధరలు మరింత కాలం అధిక స్థాయిలోనే ఉంటే, బస్సు చార్జీల పెంపుపరంగా ఒత్తిడి కొనసాగవచ్చు’ అని తెలిపారు. అంతర్జాతీయంగా 7 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా తమ బస్‌ టికెటింగ్‌ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం 163.9 మిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement