
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ త్వరలోనే మరో విడత రేట్ల కోతను చేపడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ అంచనా 6.5 శాతం మించి వృద్ధి రేటు నమోదవుతుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) సెక్రటరీ జనరల్, సీఈవో రంజిత్ మెహతా అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ) అందుబాటు ధరలపై రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ అవకాశాల పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
ఈ అంశాలను ఆర్‌బీఐ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కనుక సమీప కాలంలోనే మరో విడత రేట్ల కోత ఉంటుందని అంచనా వేశారు. జూన్ 4–6 మధ్య ఆర్‌బీఐ ఎంపీసీ తదుపరి సమీక్ష జరగనుండడం గమనార్హం. ఎస్‌ఎంఈ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ సూచీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో సానుకూలంగా ఉండడం గమనార్హం. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 50 స్థాయిలోనే మార్చిలోనూ కొనసాగింది. ఎస్‌ఎంఈ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మాత్రం 57.7 పాయింట్లతో బలంగా నమోదైంది.