
బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకానికి తాజాగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏవోఏ)లో ప్రతిపాదిత సవరణలకు అనుమతించినట్లు పేర్కొంది. దీంతో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్‌ఎంబీసీ) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలు చిక్కనుంది. మరో నామినీ డైరెక్టర్‌ను పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ఎంపిక చేయనుంది.
యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐసహా ఏడు ఇతర బ్యాంకులకు గల వాటాలను జపనీస్ దిగ్గజం ఎస్‌ఎంబీసీ సొంతం చేసుకున్నాక బోర్డులో నియామకాలకు తెరలేవనుంది. కాగా.. సెకండరీ కొనుగోళ్ల ద్వారా బ్యాంకులో 20 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ చేజిక్కించుకోనున్నట్లు మే 9న యస్ బ్యాంక్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా ఎస్‌బీఐ నుంచి 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా.. యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి మిగిలిన 6.81 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.
ఈ నెల మొదట్లో ప్రతిపాదిత డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆర్‌బీఐ సైతం ఇందుకు అనుమతిస్తూ ఎస్‌ఎంబీసీ ప్రమోటర్‌గా గుర్తింపు పొంబోదని తెలియజేసింది. ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐకు 24 శాతం వాటా ఉంది. తాజా డీల్ తదుపరి 10.81 శాతానికి వాటా పరిమితంకానుంది.