
గత ఆర్థిక సంవత్సరం(2023–24) ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ చెల్లింపులు 33 శాతం ఎగశాయి. ఉమ్మడిగా రూ.27,830 కోట్లు చెల్లించాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి భారీగా మెరుగుపడినట్లు తెలియజేస్తోంది. అంతక్రితం ఏడాది(2022–23) ప్రభుత్వ బ్యాంకులు డివిడెండ్ రూపేణా రూ.20,694 కోట్లు అందించాయి. వీటితో పోలిస్తే గతేడాది చెల్లింపులు 33 శాతం బలపడ్డాయి. కాగా.. వీటిలో 65 శాతం అంటే రూ.27,830 కోట్లు వాటా ప్రకారం ప్రభుత్వానికి అందించాయి.
ఇదేవిధంగా 2022–23లో ప్రభుత్వ వాటాకు పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ.13,804 కోట్లు చెల్లించాయి. గతేడాది ఎస్‌బీఐసహా 12 ప్రభుత్వ బ్యాంకులు పీఎస్‌యూ బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లకుపైగా నికర లాభం ఆర్జించాయి. దీనిలో ఎస్‌బీఐ వాటా విడిగా 40 శాతంకావడం గమనార్హం! 2022–23లో రూ.1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ.1.29 లక్షల కోట్ల నికర లాభం సాధించిన విషయం విదితమే.
ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!
ఎస్‌బీఐ 22 శాతం జూమ్
గతేడాది ఎస్‌బీఐ రూ. 61,077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ. 50,232 కోట్లతో పోలిస్తే 22 శాతం అధికం! పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం అత్యధికంగా 228 శాతం దూసుకెళ్లి రూ. 8,245 కోట్లను తాకింది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్ లాభం 62 శాతం వృద్ధితో రూ. 13,249 కోట్లకు చేరగా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 61 శాతం ఎగసి రూ. 2,549 కోట్లయ్యింది. ఇతర సంస్థల లాభాలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం ఎగసి రూ. 4,055 కోట్లకు, ఇండియన్ బ్యాంక్ 53 శాతం అధికంగా రూ. 2,549 కోట్లకు చేరాయి. 2017–18లో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నష్టాలు నమోదుచేయగా.. 2023–24కల్లా ఏకంగా రూ. 1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించి సరికొత్త రికార్డ్ సాధించడం కొసమెరుపు!!